రాజధాని తరలింపు వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. రాజధానిని ముక్కలు చేసుకుంటూ పోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు.

కావాలంటే కడపలో.. లేకపోతే పులివెందులలో రాజధాని పెట్టుకోమని ఆయన సూచించారు. విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందని.. రాజధానిని వేరే ప్రాంతానికి మార్చడం సులభం కాదని జేసీ వ్యాఖ్యానించారు.

రాజధానిని అమరావతిలో ఉంచడం తప్పించి, మరో మార్గం లేదన్నారు. తాత్కాలికం తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని.. అయితే ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు లాగించవచ్చని దివాకర్ రెడ్డి తెలిపారు.

రాజధానిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడున్న భవనాలను టీడీపీ చీఫ్ తాత్కాలికమని బాబు అంటూ వచ్చారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. రాయలసీమకు హైకోర్టు వస్తే ఏం లాభం ఉండదని, పది జిరాక్స్ షాపులు వస్తాయి తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు.

తల ఒక చోట, చెయ్యి ఒక చోట, కాలు మరో చోట పెట్టినట్లు రాజధానిని జగన్ విడగొడతానంటున్నాడని ఆయన మండిపడ్డారు. కడపలోనో, పులివెందులలోనో రాజధాని పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అమరావతిని మారిస్తే మాత్రం రాజధాని ఖచ్చితంగా రాయలసీమకు రావాల్సిందేనని జేసీ తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినందుకు ఇప్పటికే ఏడుస్తున్నామన్న ఆయన.. అక్కడి నుంచి విశాఖకు తరలిస్తే ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.

బెజవాడలో అన్ని ఆఫీసులు ఉండటం వల్ల పనులు చేసుకుని వస్తున్నామని.. ఇప్పుడు విశాఖకు మారిస్తే భార్యాబిడ్డలను వదిలేసి వారాల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని జేసీ సూచించారు.