Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో కొడాలిపై వెనిగండ్ల రాము ఫిక్స్.. నానిని నిలువరించగలరా, చంద్రబాబు స్ట్రాటజీ ఏంటీ..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను శనివారం ప్రకటించారు. దీనిలో భాగంగా గుడివాడ నుంచి కొడాలి నానిపై ప్రత్యర్ధిగా వెనిగండ్ల రాము పేరును చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన నానిని ఓడించేందుకు ఈసారి అన్ని రకాల అస్త్రాలు  రెడీ చేస్తున్నారు. 

tdp confirms venigandla ramu against kodali nani in gudivada for andhra pradesh assembly elections 2024 ksp
Author
First Published Feb 24, 2024, 3:03 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసిన స్థానాల్లో గుడివాడ ఒకటి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. టీడీపీపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలయ్యలపై నోరుపారేసుకునే కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఇందుకోసం బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆయన భావిస్తున్నారు. 

ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నానిని ఓడించాలంటే సాధారణ విషయం కాదు. దీనికి తోడు గుడివాడలోని ప్రతీ గల్లీలో నానికి అనుచరగణం వుంది. దీంతో చంద్రబాబు ఎవరిని బరిలోకి దించుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని సమన్వయకర్తగా నియమించినప్పటికీ చివరిలో అభ్యర్ధిని మారుస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. వీటికి చెక్ పెడుతూ వెనిగండ్ల రామునే కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను శనివారం ప్రకటించారు. దీనిలో భాగంగా గుడివాడ నుంచి కొడాలి నానిపై ప్రత్యర్ధిగా వెనిగండ్ల రాము పేరును చంద్రబాబు ఖరారు చేశారు. అంతా బాగానే వుంది కానీ .. ఇప్పుడు కొడాలి నానిని రాము ఎంతమేర నిలువరించగలరు అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చేతికి చంద్రబాబు ఎలాంటి అస్త్రశస్త్రాలు అందిస్తారా అన్నది చర్చనీయాంశమైంది.

2004 నుంచి నేటి వరకు ఓటమి ఎరుగకుండా గుడివాడలో పాతుకుపోయారు కొడాలి నాని. ఆయనను ఓడించేందుకు చంద్రబాబు.. జగన్ వేసిన బాటలోనే  నడుస్తున్నారు. అదేమిటంటే రెండు కులాల ఈక్వేషన్. అంటే భర్త ఒక కులమైతే, భార్య మరో కులం. శింగనమల, చిలకలూరిపేట, తాడికొండ, కళ్యాణదుర్గంలో ఇదే స్ట్రాటజీని అమలు చేశారు. 

దీని ప్రకారం గుడివాడలో వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. ఆయన సతీమణి మాల సామాజిక వర్గానికి చెందినవారు. భర్త గెలుపు కోసం ఆమె కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ, దళితులను టీడీపీ వైపు తిప్పేలా చొచ్చుకుపోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో అదనపు బలం రాముకి చేకూరినట్లయ్యింది. గుడివాడలో కాపులు, పవన్ అభిమానుల సంఖ్య ఎక్కువే. వీటన్నింటి సాయంతో కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో వున్నారు. మరి గుడివాడ అడ్డాలో నాని తన పట్టు నిరూపించుకుంటారా.. లేక చంద్రబాబు వ్యూహాలకు బలౌతారా అన్నది వేచి చూడాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios