అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక ప్రతినిధి పోస్టుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. 

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని, ఆ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమంటూ ఫిర్యాదులో పేర్కొంది. విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని పేర్కొంది. అది రాజ్యాంగ ఉల్లంఘనకిందకి వస్తుందని స్పష్టం చేశారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాపర్టీ కింద రాజ్యసభ సీటు వదులుకోవాల్సి ఉంటుందని ఫిర్యాదులో సూచించారు. విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు పడుతుందని మేల్కొన్న ఏపీ ప్రభుత్వం జూలై 4న ఆ జీవో రద్దు చేసిందని తెలిపారు.  అయితే తాజాగా ఆయన నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. 

విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులవ్వడంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందని మండిపడ్డారు. ఈ అంశంపై త్వరలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కలుస్తామని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు.