Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబులో ‘‘ కుప్పం ’’ టెన్షన్ .. మాటి మాటికి ఈ పర్యటనలేంటీ , జగన్ అంతలా భయపెడుతున్నారా..?

1989 నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా నిలుస్తోంది. కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా గుర్తింపు దక్కింది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు అందుకున్న నాటి నుంచి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టి ముచ్చెమటలు పట్టించారు జగన్.

tdp chiefchandrababu naidu fear about kuppam ksp
Author
First Published Dec 29, 2023, 3:08 PM IST

కుప్పం.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. 1989 నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా నిలుస్తోంది. కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా గుర్తింపు దక్కింది. తనను ఏళ్లుగా ఆదరిస్తూ వస్తోన్న ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు సైతం అభివృద్ధి చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసినా, చేయకున్నా చంద్రబాబును ఇక్కడి ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో ఎంతగా బిజీగా వున్నా ఆడపాదడపా చంద్రబాబు కుప్పానికి వస్తూనే వున్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత మాత్రం చంద్రబాబు తరచుగా ఇక్కడికి రావడం కలకలం రేపుతోంది. 

ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు అందుకున్న నాటి నుంచి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టి ముచ్చెమటలు పట్టించారు జగన్. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వై నాట్ 175 అన్నట్లుగానే.. వై నాట్ కుప్పం అని ప్రత్యేక స్లోగన్ అందుకున్న జగన్ .. చంద్రబాబును ఓడించాలని వ్యూహ రచన చేస్తున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నా చంద్రబాబు కుప్పానికి చేసిందేమి లేదని అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. 

అయితే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేసి దానిని అమలు పరుస్తున్నారు. తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని , కుప్పం ప్రజలు తన వెంటే వున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నేరుగా కుప్పం వచ్చారు. మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి .. పార్టీని మరింత బలోపేతం చేసేలా నేతలకు సూచనలు చేయనున్నారు. అధికారంలోకి రాగానే 10 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసే పరిశ్రమను తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలు అమలయ్యేలా చూస్తానని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు. కుప్పంలో తనను ఓడిస్తానని శపథం చేసిన వైసీపీ నాయకులు ఏపీ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 

అంతా బాగానే వుంది కానీ.. రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంకు చంద్రబాబు తరచుగా రావడం మాత్రం చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడం కంటే ముందు ఆయన పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఎక్కడ జగన్ తనను ఓడించేస్తారోనని చంద్రబాబు కలవరపాటుకు గురవుతున్నారు. ముందుగానే అభ్యర్ధిని ప్రకటించి మరీ చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు జగన్. ఈ క్రమంలోనే బాబుకి తన గెలుపుపై అనుమానాలున్నాయ్. అందుకు ఆయన పదే పదే కుప్పంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

స్కిల్ స్కాం, జైలుకు వెళ్లడం, బెయిల్ వ్యవహారాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న చంద్రబాబు .. కుప్పం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కుప్పం రావడమే కాదు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఆ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు. మొత్తం మీద సీఎం జగన్ దూకుడుతో చంద్రబాబులో కాస్తయినా ఆందోళన మొదలయ్యిందనే చెప్పాలి. సైలెంట్‌గా వుంటే తన సొంత నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కుప్పంపై ఆయన ఫోకస్ పెట్టారు. మరి ఈ గేమ్‌లో చంద్రబాబు, జగన్‌లలో ఎవరిది పైచేయి కానుందో మరికొద్దినెలల్లో తేలిపోనుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios