అమరావతి: శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్యకారులు లాక్ డౌన్ కారణంగా కర్ణాటకలోని ఉడిపిలో చిక్కుకున్నారు. అక్కడ వారు పడుతున్న ఇబ్బందులు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. వారికి సహాయం అదించి స్వస్థలాలకు తరలించాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కు నేరుగా ఫోన్ చేసి వేడుకున్నారు చంద్రబాబు. అంతేకాకుండా ఓ లేఖను కూడా రాశారు. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించడం కుదరని పక్షంలో అవసరమైన ఆహారం,ఉండటానికి ఏర్పాట్లు చేయాలని కర్ణాటక సీఎంను కోరారు చంద్రబాబు.

యడియూరప్పకు చంద్రబాబు రాసిన లేఖ యదావిధిగా...

 తేది: 6 మే 2020

శ్రీ బిఎస్ యడ్యూరప్పగారికి, 

ముఖ్యమంత్రి గారు,

కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు.

విషయం: కోవిడ్ లాక్ డౌన్ – కర్ణాటకలో ఉడుపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకు పోయిన శ్రీకాకులం జిల్లా మత్స్యకారులు 300మంది-ఆహారం లేక అగచాట్లు-తక్షణ సహాయం నిమిత్తం-ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వారిని తరలించడం గురించి.

కోవిడ్ 19పై కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విపత్కర సమయంలో మేమంతా మీతోపాటు కర్ణాటక ప్రజలకు సంఘీభావంగా ఉంటాం. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా పొరుగు  రాష్ట్రాలకు వలస వెళ్లిన ఏపి కార్మికులు అనేకమంది ఆయా ప్రాంతాలలో అష్టకష్టాలు పడుతున్నారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300మంది మత్స్యకారులు కర్ణాటకలోని ఉడిపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకుపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. వారి యోగక్షేమాలపై  స్థానికంగా ఆయా కుటుంబాల సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు తల్లడిల్లుతున్నారు. వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయా కుటుంబాల తరఫున, ప్రత్యేకించి నా తరఫున మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. అది వీలుగాని పక్షంలో లాక్ డౌన్ పూర్తయ్యేదాకా వారికి అక్కడే ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్య సాయం ఇతర నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరుతున్నాను. సదరు తెలుగు మత్స్యకారులను ఆదుకునేందుకుగాను ఆనంద్ (+91 90047 78368) ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభినందనలతో...

భవదీయుడు
నారా చంద్రబాబు నాయుడు

ఈ కాపీని తదుపరి చర్యల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జత పర్చడమైనది.