వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... రోగుల సేవల ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమన్నారు. కరోనా కేసులు దాచిపెట్టడం మంచిది కాదని, ఒకవేళ అలా చేస్తే వైరస్ దావానలంలా వ్యాపిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

దీనికి నెల్లూరు, కర్నూలు వైద్యుల ఉదంతాలే ఉదాహరణ అని టీడీపీ అధినేత చెప్పారు. ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలనే కరోనా తీయడం ఆందోళన కలిగించే విషయం అన్నారు.

రక్షణ ఉపకరణాలు లేకే వైద్యులు బలవుతున్నారని.. తక్షణమే వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు ముందు చూపు ఉండాలన్న ఆయన అభివృద్ధి కొనసాగిస్తే జాతికి ప్రయోజనమేనని చెప్పారు.

నాశనం చేస్తే జాతి క్షమించదన్నారు. ప్రధాని అన్ని పార్టీలతో, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులను సంప్రదించి ఏకాభిప్రాయం తెచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. మనదేశంలో తొలిదశ లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని, అందుకే ధైర్యంగా లాక్‌డౌన్‌ను పొడిగించారని ప్రతిపక్షనేత ప్రశంసించారు.

ఏపీలో వైసీపీ నేతలు ఇష్టానుసారం చేస్తున్నారని.. పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరోనా నిర్థారణా పరీక్షలపై అబద్ధాలు చెబుతున్నారని.. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోందని మండిపడ్డారు.

కోవిడ్ 19ను తేలిగ్గా తీసుకోవద్దన్న ఆయన ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 నగదు సాయం అందరికీ అందలేదని చంద్రబాబు ఆరోపించారు. రేషన్ దుకాణాల్లో పంచదార ఇచ్చి రూ.10 వసూలు చేస్తున్నారని, ఇలాంటి విపత్కర సమయంలో పేదలకు అండగా నిలిచి నిత్యావసరాల పంపిణీ కొనసాగించాలని చంద్రబాబు చెప్పారు.