అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపి పోలీసులకు విరుచుకుపడ్డారు. కొందరు ఆకతాయిలు ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ఘోరంగా పోస్ట్ లు పెట్టారని... ఇలాంటివారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏపి డిజిపి సిగ్గుతో తలవంచుకోవాలని విమర్శించారు. 

మీ కూతురుపై, భార్యపై ఇలాంటి పోస్ట్ లు పెడితే వదిలేస్తారా...? అంటూ ఘాటూ విమర్శలు చేశారు. తప్పు చేస్తే తమవాళ్లను కూడా అరెస్ట్ చేయండి కానీ ఇలా టెర్రరైజ్ చేయడం సరైంది కాదన్నారు. తాను అందుకే చెప్పా ఖాకీ టెర్రరిజం అని... ఇదే ఖాకీ టెర్రరిజం అంటే...ఇది ఎల్లకాలం సాగదంటూ చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు.  

అంతగా కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కు ఊడిగం చేసుకోండి... కానీ మహిళల జోలికి వచ్చేవారిని మాత్రం వదలవద్దని సూచించారు. అలాకాకుండా ఆయన మెప్పు కోసం మహిళలను కించపరిచే ఆకతాయిలను చూసి చూడనట్లు వదిలేయడం సమాజానికే కాదు మీకు కూడా మంచిది కాదన్నారు. 

read more  కరోనా నియంత్రణను అడ్డుకున్నది నిమ్మగడ్డ, చంద్రబాబులే...ఎలాగంటే: సజ్జల సంచలనం

పోలీసుల వ్యవహార తీరుపై ఈ రోజే డిజిపికి లెటర్ రాస్తున్నట్లు...దానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. తాను గతంలో పోలీసులకు ఇచ్చిన బాడీవోర్న్ కెమెరాలు ఎందుకు పెట్టుకోవడం లేదని  ప్రశ్నించారు. మీరు మాట్లాడేది... ఎదుటివాళ్లు మాట్లాడేది రికార్డ్ అవుతుంది కాబట్టే వాటిని వాడటం లేదన్నారు. కనీసం నేమ్ ప్లేట్లు కూడా లేకుండా తిరుగుతున్నారు దొంగల మాదిరిగా అంటూ చంద్రబాబు విమర్శించారు. 

తాము కూడా ఇకపై పోలీసుల తీరును సెల్ ఫోన్లలో రికార్డింగ్ చేస్తామని...అప్పుడు మీరేం అన్నారో, తామేం చెప్పామో రికార్డ్ చేసి సాక్ష్యాధారాలుగా వాడతామన్నారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేయండి... జైలుకు పోవడానికి కూడా సిద్దంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు. 

''మీరు హైహ్యాండ్ గా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు. చట్టం అందరికీ ఒకటే తప్ప చట్టం ఎవరికీ చుట్టం కాదని గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఏదిబడితే అదిచేస్తే మీరే చిక్కుల్లో పడతారు'' అని హెచ్చరించారు.

read more   స్థానికసంస్థల వాయిదా... మాజీ ఎన్నికల కమీషనర్ తో జగన్ మంతనాలు

''ఈ రోజు కూడా మద్యం సీసాలు పెట్టి అరెస్ట్ చేస్తారా..? ఇది న్యాయమా, ఇది చట్టమా..? మమ్మల్ని రెచ్చగొట్టవద్దు. అనవసరంగా మీ ప్రతిష్ట పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాం.
 ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రావల్స్ చేయిస్తున్నారు అన్ని సాక్ష్యాధారాలతో కోర్టులకు వెళ్తాం, వదిలిపెట్టే సమస్యే లేదు'' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

''ప్రజల ఆదరణతో గెలుస్తామనే ఆశ వైసిపి వాళ్లకు లేదు. ప్రజలు ఛీకొట్టే పరిస్థితి ఉంది. ఇంకొన్ని రోజులు పోతే ముఖానే ఊస్తారు. అందుకే బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తున్నారు. డాక్యుమెంట్లతో అన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తాం. క్రిమినల్ ప్రాసిక్యూషన్ వేస్తాం. వదిలిపెట్టే సమస్యేలేదని’’ చంద్రబాబు హెచ్చరించారు.