ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఒంగోలులో పర్యటించనున్న నేపథ్యంలో కాన్వాయ్ కోసం సామాన్యుడి వాహనాన్ని అధికారులు లాక్కోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ (YS Jagan) రేపు (శుక్రవారం) ఒంగోలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మండిపడ్డారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ పిల్లాపాపలతో తిరుపతి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి కారును లాక్కెళ్లడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసేవ చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలా ప్రజలను ఇబ్బందిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు సామాన్య ప్రజల కార్లను లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.
''కుటుంబంతో తిరుమలకు వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న అతడి కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది?ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?'' అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇలాగే వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసెయ్యడం చేస్తున్నారని... ఇప్పుడు మరింత దిగజారి సిఎం కాన్వాయ్ కోసం సామాన్యుల కార్లను బలవంతంగా లాక్కెళ్ళే స్థాయికి చేరారని... ఇది సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు.
ఒంగోలు ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితుడు వేమల శ్రీనివాస్ కుటుంబంతో గురువారం ఉదయం మనోహర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రైవేటు వాహనంలో తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని రాత్రి పూట నడిరోడ్డుపై ఉంచేసి ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆ వాహనాన్ని ఆర్టీఏ అధికారులు తీసుకువెళ్లడం దుర్మార్గపు చర్యగా నాదెండ్ల పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలో ఆర్టీఏ అధికారులు వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబాన్ని ఇక్కట్లకు గురయ్యేలా ప్రవర్తించడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇదో కొత్త తరహా పాలనలా ఉందని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలు ఘటనపై ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే విచారణకు ఆదేశించగా తప్పుచేసినట్లుగా తేలడంతో AMVIసంధ్య, హోంగార్డు తిరుపతిరెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అసలేం జరిగింది:
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలు దేరారు. ఒంగోలు పట్టణంలోని బుధవారం నాడు రాత్రి చేరుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లోని హోట్ వద్ద శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అక్కడికి వచ్చి సీఎం పర్యటన నేపథ్యంలో వాహనం కావాలని అడిగాడు. తాము తిరుపతికి వెళ్తున్నామని చెప్పినా కూడా విన్పించుకోకుండా డ్రైవర్ తో సహా వాహనాన్ని తీసుకెళ్లాడు. దీంతో తిరుమల వెళ్ళాల్సిన శ్రీనివాస్ కుటుంబం ఒంగోలులోనే చిక్కుకుంది. చివరకు మరో వాహనం తెప్పించుకుని వారు తిరుమలకు చేరుకున్నారు.
