ప్రత్యేక హోదా విషయమై ఎన్డీఏను వీడాం: మోడీని పొగడ్తలతో ముంచెత్తిన బాబు
మోడీ ని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ కారణంగానే భారత్ ను ప్రపంచం గుర్తిస్తుందన్నారు. ప్రత్యేక హోదా అంశంతోనే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.
అమరావతి: మోడీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. మంగళవారంనాడు టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్ దనీడ్ టు కీప్ ఫైటింగ్ సదస్సు లో చంద్రబాబు ప్రసంగించారు. వర్చువల్ గా ఈ సదస్సులో ఆయన పాల్గొన్నారు. మోడీ వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్ ను గుర్తిస్తుందన్నారు. ఎన్డీఏ అభివృద్ది విధానాలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీఏ నుండి బయటకు వచ్చామన్నారు.
మోడీ అభివృద్ది విధానాలతో ఏకీభవిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
పబ్లిక్, పీపుల్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ అన్నది కొత్త విధానమని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీతో పేదరికాన్ని రూపుమాపవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. :పిన్ టెక్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చిందని చంద్రబాబు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ డెమోగ్రాపిక్ డివిడెండ్ దేశాన్ని నడిపిస్తాయన్నారు. మోడీ విధానాలను ఇంకా మెరుగుపెడితే 2050 నాటికి ప్రపంచంలో భారత్ దే అగ్రస్థానమని మోడీ ఆయన అభిప్రాయపడ్డారు. రూ. 500 కంటే పెద్దనోట్లన్నీ రద్దు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబునాయుడు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. మోడీ సర్కార్ పై అవిశ్వాసం కూడా ప్రతిపాదించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. కానీ 2019 ఎన్నికల్లో మోడీ రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయలేదు. కానీ మోడీపై చంద్రబాబు ఇలా పొగడ్తలు కురిపించడం 2019 ఎన్నికల తర్వాత బహుశా ఇదే ప్రథమంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.