Asianet News TeluguAsianet News Telugu

ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు

tdp chief chandrababu naidu tweets on restoring nimmagadda Ramesh Kumar as sec
Author
Amaravathi, First Published Jul 22, 2020, 3:31 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. బుధవారం వరుస ట్వీట్ల ద్వారా స్పందించారు.

తద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ చర్యల ద్వారా ఆర్టికల్ 243 కె(2) కు సార్థకత ఏర్పడిందని బాబు అన్నారు.

Also Read:వైఎస్ జగన్ కు షాక్: నిమ్మగడ్డ కొనసాగింపునకు గవర్నర్ ఆదేశాలు

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసా విధ్వంపాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్రదిష్ట వాటిల్లిందని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య మూలస్థంభాలైన (లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా) మనుగడ ప్రశ్నార్ధకమైందని ఆయన ఆరోపించారు.  

కరోనాలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసి తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే అని చంద్రబాబు మరోసారి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహమన్నారు.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబు హితవు పలికారు. ఎస్ఈసి తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎన్నికల సంఘం నిష్పాక్షిక విధి నిర్వహణకు దోహద పడాలని, ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చంద్రబాబు నాయుడు కోరారు.     
 

Follow Us:
Download App:
  • android
  • ios