ఇటీవల కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు అండగా వుండాలని టిడిపి శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

అమరావతి : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు.రేపు, ఎల్లుండి (మే 4,5 తేదీల్లో) వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న చంద్రబాబు బాధిత రైతులు భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో అకాల వర్షాలు, పంటనష్టంపై చర్చించేందుకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో తన పర్యటన గురించి ప్రకటించారు. 

పంటలు చేతికందివచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులను తీవ్ర నష్టాలపాలు చేస్తున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవడంతో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు. కాబట్టి టిడిపి శ్రేణులు నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ మేరకు రైతులను ఆదుకోవడంపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. 

గత కొద్దిరోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని... దీంతో చేతికందివచ్చిన పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పంట ఈ అకాల వర్షాలతో దెబ్బతిందని... ప్రభుత్వ వైఫల్యం వలనే ఇంత భారీ నష్టం జరిగిందని అన్నారు. వర్షాలపై ముందస్తుగానే సమాచారం వున్నా రైతుల పంటలు కాపాడేందుకు జగన్ రెడ్డి సర్కార్ చర్యలేమీ తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. 

Read More దెబ్బతిన్న ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తాం: రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ భ‌రోసా

 అకాల వర్షాల నుండి రైతుల పంటలను కాపాడలేకపోయినా కనీసం నష్టపోయిన అన్నదాతలను ఈ ముఖ్యమంత్రి, మంత్రులు పరామర్శించలేదని చంద్రబాబు అన్నారు. గతంలో ఇలాగే వర్షాలతో నష్టపోయిన రైతులను తానే స్వయంగా వెళ్లి మాట్లాడి భరోసా ఇచ్చానని... మంత్రులు, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రైతులను పరామర్శించారని అన్నారు. ఈ ప్రభుత్వం మాత్రం వారి మానాన వారే పోతారనుకుని రైతులను గాలికి వదిలేసారని అన్నారు. నష్టపోయిన రైతులకు సకాలంలో నష్టపరిహారం ఇవ్వాలని... వెంటనే ధాన్యాన్ని సేకరించాలని చంద్రబాబు వైసిపి ప్రభుత్వాన్ని కోరారు. 

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చంద్రబాబు తెలిపారు. ఇలా తడిసిన దాన్యాన్ని, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. అలాగే వరి, మొక్కజొన్న పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున, మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. 

ఇక పిడుగుపాటుకు గురయి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోరారు. ఇక పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక... ఇలా ప్రకృతి వైపరిత్యాలతో పంటలను నష్టపోయే రైతులకు పరిహారం అందంచాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.