వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. సీఎం సహా ఎవరూ మాస్కులు పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ప్రవర్తించారని చంద్రబాబు మండిపడ్డారు.

సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రతిపక్షనేత నిలదీశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత అభిప్రాయపడ్డారు.

తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలు పెట్టలేదని ఆయన గుర్తుచేశారు. వైసీపీలో చేరాలని బెదిరింపులు పాల్పడటం రాజకీయామా అని చంద్రబాబు ప్రశ్నించారు. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడటం లేదన్నట్లుగా వైసీపీ నేతల వైఖరి వుందని, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

గొట్టిపాటి రవికి రూ.300 కోట్లు ఫైన్ కట్టాలంటూ నోటీసులు పంపారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటని ప్రశ్నించిన ఆయన.. వైసీపీ నేతల్లాగా గనులు, భూములు, దోపిడి చేయలేదని... పంచాయితీలు పెట్టలేదని చంద్రబాబు ఆరోపించారు.

అచ్చెన్నాయుడిని పార్టీలోకి రమ్మని, ప్రలోభాలు పెట్టి అన్నిచేసి చివరికి లాభం లేక అరెస్ట్‌కు తెర తీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గోడలు, గేట్లు దూకి ఆయనను అరెస్ట్ చేశారని.. పైల్స్ చేసి ఆపరేషన్ జరిగిన వ్యక్తిని గంటల పాటు జర్నీ చేయించారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో అవినీతిని నిలదీస్తారనే భయంతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారని చంద్రబాబు మండిపడ్డారు.