అంగళ్లు, పుంగనూరులలో ఇవాళ జరిగిన విధ్వంసానికి కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.  పుంగనూరుకు పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా  ఈ రోడ్డు మీదుగా తనను రావొద్దు అనటానికి ఈ రోడ్డు పెద్దిరెడ్డి తాత జాగీరా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం పుంగనూరులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. పుంగనూరుకు పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా అంటూ వ్యాఖ్యానించారు. ఈ రోడ్డు మీదుగా తనను రావొద్దు అనటానికి ఈ రోడ్డు పెద్దిరెడ్డి తాత జాగీరా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంగళ్లు, పుంగనూరులలో ఇవాళ జరిగిన విధ్వంసానికి పెద్దిరెడ్డి, పోలీసులే కారణమని చంద్రబాబు ఆరోపించారు. విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలు తిరగబడితే మీరు పోతారంటూ ఆయన హెచ్చరించారు. 

తాను మళ్లీ వస్తానని.. పుంగనూరు మొత్తం తిరుగుతానని చంద్రబాబు వెల్లడించారు. తలలు పగులుతున్నా.. నెత్తురోడుతున్నా నిలబడిన టీడీపీ కేడర్‌ను ఆయన అభినందించారు. చల్లా బాబుపై దెబ్బపడితే తనపై పడ్డట్లేనని.. ప్రజలకు అండగా వుంటానని, వై నాట్ పుంగనూరు, వై నాట్ 175 అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిన స్క్రిప్ట్‌ను దేవుడు తిరగరాశాడని ఆయన అన్నారు. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీకి దాసోహం కావొద్దు.. శాంతి భద్రతలను కాపాడాలని చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు. 

Also Read: పక్కా స్కెచ్‌తోనే పోలీసులపై దాడి.. గొడవ పడేందుకే టీడీపీ కేడర్‌ ఇక్కడికి , వదలేది లేదు : చిత్తూరు ఎస్పీ

మరోవైపు.. చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లులో జరిగిన విధ్వంసక ఘటనలపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే గొడవ చేశారని ఆయన ఆరోపించారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో 2 వేల మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారని రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులపై పక్కాప్లాన్ ప్రకారం దాడి జరిగిందని ఆయన తెలిపారు. వాళ్లు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి వుందని.. కానీ వారు అలా వెళ్లకుండా పుంగనూరులోకి వచ్చారని ఎస్పీ చెప్పారు. దీంతో పుంగనూరులోకి రాకుండా టీడీపీ క్యాడర్‌ను అడ్డుకున్నామని రిషాంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగారని ఎస్పీ తెలిపారు. 2 పోలీస్ వాహనాలను తగులబెట్టారని.. ఈ ఘటనలో 14 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. రాళ్లదాడిలో మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయని రిషాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని.. దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టేది లేదని ఎస్పీ తేల్చిచెప్పారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసుపై కాదని ఆయన హితవు పలికారు. గొడవ పెట్టుకునేందుకే టీడీపీ కేడర్ ఇక్కడికి వచ్చారని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు.