ప్రజలు కరోనాతో బాధపడుతుంటే మళ్లీ రాష్ట్రంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై బాబు స్పందించారు.

రాజధాని కోసం అమరావతి రైతులు భూములిస్తామని ముందుకొచ్చారని.. అమరావతి రాజధాని ప్రజల కల అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అందరూ షాకయ్యారని.. ఎందుకీ పైశాచిక ఆనందమని ఆయన ప్రశ్నించారు.

విభజన చట్టంలో ఒక రాజధాని అని స్పష్టంగా ఉందని.. చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన చట్టానికే తూట్లు పొడిచారని.. ప్రజల ఆశలను సర్వనాశనం చేశారని బాబు మండిపడ్డారు.

రాజధాని విషయంలో ఎందుకు మడమ తిప్పారో జగన్ జవాబివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బిల్లులపై కౌన్సిల్‌లో రగడ జరిగిందని.. లక్ష కోట్లు కావాలని అపవాదు వేశారని, నానా రకాలుగా తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతి రైతుల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని... రాష్ట్రంలో అనైతిక పాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ప్రతిపక్షనేత  ధ్వజమెత్తారు.

ఈ రోజు గవర్నరే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిని తరలించేందుకు అనేక అబద్ధాలు ప్రచారం చేశారని.. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఆయన చెప్పారు.

మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధికి విఘాతం తథ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అనేక అభివృద్ధి పనులు మంజూరు చేశామని.. విశాఖ అభివృద్ధికి అనేక సంస్కరణలు తెచ్చామని టీడీపీ అధినేత గుర్తుచేశారు.

రాయలసీమలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేశామని.. సీమలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర ప్రజలు అసహ్యించుకునే నిర్ణయాలు  తీసుకుంటున్నారని.. హైదరాబాద్ అభివృద్ధిని చూసైనా తమ ముందుచూపును గుర్తించాలని ఆయన హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... ఏపీలో వైసీపీ ప్రభుత్వ 14 నెలల పాలనా కాలంలో అభివృద్ధి శూన్యమని చంద్రబాబు ఆరోపించారు. ఇలా బిల్లులను ఆమోదించుకోవడం దుర్మార్గమని.. ప్రతీ పౌరుడూ ఆలోచించాలని, ఇది రాజకీయ పార్టీల గొడవ కాదన్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే భవిష్యత్తు ఉండదని బాబు అన్నారు.