Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం... కీలక నిర్ణయాలివే...

వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రభుత్వంతో పోరాడాలని టిడిపి నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు టిడిపి కార్యాచరణను ప్రకటించారు. 

TDP Chief Chandrababu Naidu Meeting with Party Seniors
Author
Amaravati, First Published Sep 13, 2021, 4:44 PM IST

అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష టిడిపి పార్టీ ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి ముఖ్యనేతలు సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వంతో పోరాడాలని నిర్ణయించిన టిడిపి పలు కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. 

టిడిపి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే: 

1. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జోనల్ వారీగా రైతు కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్రంలో పంట పొలాలు కౌలుకు చేసుకునే పరిస్థితులు కూడా లేవు. పెట్టుబడి వ్యయం రెట్టింపు అయింది. రైతులకు ఇచ్చే సబ్సీడీలు నిలిచిపోయాయి. వ్యవసాయ శాఖ మూతపడింది. దీంతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. రైతులకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఏపీ రైతుల సగటు రుణభారం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని, సగటున రైతు కుటుంబ రుణభారం రూ.2.5 లక్షలకు మించి ఉండి.. ఏపీ నెం.1 స్థానంలో ఉండటం జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

2. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ‌ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జగన్ మైనార్టీలకు చేసిన ద్రోహంగా అభిప్రాయపడడమైంది. పరామర్శకి వెళ్లిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఫారూఖ్ షుబ్లీని వెంటనే విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. మైనార్టీ సంఘాల ఆందోళనలకు మద్దతు తెలపడమైంది. మైనార్టీల భూమి కబ్జాకు ప్రయత్నించిన తిరుపాల్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టలేదు?

3. కరెంట్ ఛార్జీల పెంపుతో జగన్ రెడ్డి పెనుభారం మోపారు. దీనివల్ల అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రొయ్యలు, చేపల చెరువుల రైతుల వద్ద కూడా ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక రొయ్యల రైతుకు గతంలో రూ.28 వేలు విద్యుత్ బిల్లు ఉండగా.. అది నేడు రూ.58 వేలకు పెరిగింది. ఇప్పటికే 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.9 వేలకోట్ల భారం వేశారు. అది చాలదన్నట్లుగా ఆరోసారి మరో రూ.2,542 కోట్లు పెంచి మొత్తం 11,500 కోట్లు ఇంతలోనే భారాలు మోపడాన్ని సమావేశం ఖండించింది. ఈ భారాలు మోపడానికి కారణం కమీషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్ ను కొని.. ఆ భారాలు ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిని సరిగా చేయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మిగులు విద్యుత్ ను తెలుగుదేశం ప్రభుత్వం జగన్ రెడ్డి చేతిలో పెట్టినా.. దానిని అస్తవ్యస్తం చేయడాన్ని ఖండించింది.

4. ప్రభుత్వమే మటన్, చేపల షాపులు నిర్వహిస్తుందన్న జగన్ రెడ్డి వ్యవహారశైలి రాష్ట్రమంతటా హాస్యాస్పదంగా మారింది. ఇది కులవృత్తులను దెబ్బతీసే చర్యగా అభిప్రాయపడడమైంది.

5. వైకాపా నేతలు ఎక్కడికక్కడ దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. మైనార్టీ, క్రిష్టియన్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేయడానికి జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సమావేశం ఖండించింది. ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడాన్ని సమావేశం ఖండించింది. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. 

6. చట్టాలను ఉల్లంఘించే పోలీసులు, ఇతర అధికారులను భవిష్యత్ లో వదిలిపెట్టకూడదని, ప్రైవేటు కేసులు పెట్టాలని నిర్ణయించడమైంది. 

7. రేషన్, పెన్షన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపులు కొడుతున్నది. తొలగించిన రేషన్, పెన్షన్ల పునరుద్ధరణ కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగించాలని సమావేశంలో నేతలు తీర్మానించారు.

8. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని సమావేశం అభిప్రాయపడింది.

9. కరోనా వ్యాక్సిన్ విషయంలో జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువగా ఉన్న విషయాన్ని గమనించాలి. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ప్రాణాల పట్ల జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు.

10. ఫైబర్ గ్రిడ్ లో రూ.2 వేల కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఖర్చు చేసిందే రూ.307 కోట్లు కాగా.. అందులో రూ.2 వేల కోట్లు ఎలా అవినీతి జరుగుతుంది? టీడీపీ ప్రభుత్వం రూ.149కే కనెక్షన్ ఇవ్వగా.. దాన్ని జగన్ రెడ్డి రూ.350 కు పెంచారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ.250 కోట్లు ఆదాయం వచ్చింది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టు ఇచ్చినందుకు అందులో పనిచేసిన 19 మందిపై అక్రమ కేసులు పెట్టడాన్ని సమావేశం ఖండించింది.

11. పంచాయతీల్లో కూడా ఆస్తిపన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం. భవిష్యత్ లో గ్రామాల్లో కూడా చెత్తపైన, పారిశుద్ధ్యంపైనా పన్నువేస్తారని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. 

ఈ సమావేశంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య,  కాలవ శ్రీనివాసులు,  బండారు సత్యనారాయణ మూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు,  పయ్యావుల కేశవ్,  నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమా మహేశ్వరరావు, అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  బీసీ జనార్థన్ రెడ్డి,  మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios