ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల మరో పిటిషన్ .. వరుసగా వేస్తూ వెళ్తారా, న్యాయమూర్తి ఆగ్రహం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలన కోసం అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులపై ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలన కోసం అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ కార్యాలయంలో పత్రాల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. సెక్షన్ 207 సీఆర్‌పీసీ కింద పిటిషన్ దాఖలు చేశారు.
అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులపై ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పిటిషన్లు వేస్తే కోర్టు విధులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఆర్డర్స్ ఇచ్చే సమయానికి మరో కొత్త పిటిషన్ ఎలా వేస్తారని ఫైర్ అయ్యారు. కోర్టులో పిటిషన్ వేయాలనుకుంటే ఒక ప్రోసీజర్ వుంటుందన్నారు. పిటిషన్ వేయాలనుకుంటే మధ్యాహ్నం 12 గంటల లోపు వేయాలని.. అది నెంబర్ అవుతుందన్నారు. కోర్టు ప్రొసీజర్ ఫాలో కాకుంటే ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేరే కేసులు పెండింగ్‌లో వుంటున్నాయని జడ్జి అన్నారు. డైరెక్ట్‌గా పిటిషన్ వేసి విచారించాలనడం సరికాదని న్యాయమూర్తి హితవు పలికారు.
మరోవైపు.. చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలని ఆయన తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు హోదా, వయసు రీత్యా హౌస్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలిన న్యాయమూర్తిని కోరారు. మరోవైపు సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు.