ఒంగోలులో జరిగిన మహానాడు ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అరాచక, విధ్వంసక పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదికైందని చెప్పారు. ప్రజాసమస్యలపై మరింతగా పోరాడానికి పార్టీ నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ఒంగోలులో జరిగిన మహానాడు ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాసమస్యలపై మరింతగా పోరాడానికి పార్టీ నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్ ద్వారా చంద్రబాబు నాయుడు పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై విరామం లేకుండా మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అరాచక, విధ్వంసక పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదికైందని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు మహానాడుతో భరోసా వచ్చిందన్నారు. మహానాడు విజయాన్ని పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. 

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందన్నారు. క్విట్ జగన్ సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మూడేళ్ల పాలనలో 1,116 అక్రమాల పేరుతో టీడీపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఆంద్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తుందన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ఏపీని తిరోగమనంలోకి నెట్టేసిందని విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టులను నాశనం చేశారని మండిపడ్డారు. మూడేళ్ల జగన్ పాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. 

జగన్‌ది విధ్వంసకర పాలన అని విమర్శించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, జగన్ పాలనలో ప్రజలను ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు నాంది పలికారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు.

చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని విమర్శించారు. గడప గడపకు వస్తున్న వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తుండటంతో.. మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డిజీల్ ధరలపై అధికర ధరలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం వీరబాదుడు బాదేస్తోందన్నారు. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారని అన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు. బీసీ మంత్రులు నోరు లేని మూగ జీవులు అని అన్నారు. కార్పొరేషన్లతో ఒక్కరికి ప్రయోజనం చేకూరిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.