ఎన్ని కష్టాలున్నా ఎన్టీఆర్‌ను చూసి అన్ని మరిచిపోతున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం గుంటూరులో జరిగిన ఎన్టీ రామారావు జయంతి వేడుకల్లో బాబు పాల్గొన్నారు.

అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి కాదని ఒక వ్యవస్థ అని బాబు తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వదిలిపెట్టలేదన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు లోటు లేకుండా చేశామని చంద్రబాబు తెలిపారు.

ఎన్నికల్లో పార్టీ ఓటమిని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఎంతోమందిని ఓదార్చానన్నారు. మూడున్నర దశాబ్ధాలుగా అందరికి అందుబాటులో ఉన్నానని ఇప్పుడు కూడా అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు.

ఓటమికి తోడ్పడిన అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. జగన్‌కు కొంత సమయం ఇద్దామని.. ఆ లోపు ఏం చేస్తారో చూద్దామని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.