తమ కార్యకర్తలపై దాడులు ఆగటం లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. నెల్లూరులో మంగళవారం పర్యటించిన ఆయన నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం బాబు మాట్లాడుతూ.. వైసీపీ అణచివేత రాజకీయాలు చేస్తోందని, అరాచక రాజకీయంపై సీఎం, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 4 నెలల్లో ఏపీని దివాలా తీసే పరిస్థితికి తెచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఐదు నెలల నుంచి పోలవరం పనులు నిలిపివేశారని.. వైసీపీ కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాల పేరుతో ప్రజాధనం దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

రివర్స్ టెండరింగ్ పేరిట మోసం చేస్తున్నారని .. దక్షిణాది బిహార్‌గా రాష్ట్రం తయారైందన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయం.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా రెండూ ఒకటికావని చంద్రబాబు తెలిపారు.

కేంద్రం ఇచ్చే సాయాన్ని కూడా తామే ఇస్తున్నట్లుగా ప్రచారం కోసం వాడుకోవటం నీచమైన చర్యగా టీడీపీ అధినేత అభివర్ణించారు. కేంద్రం అంగీకరించకపోయే సరికి పథకాన్ని ‘‘వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌’’గా మార్చారని ఆయన దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం చేసింది రివర్స్ టెండరింగ్ కాదని.. రిజర్వ్ రెండరింగ్ అని ధ్వజమెత్తారు. 

ఒక రైతుబిడ్డగా వైయస్ఆర్ రైతుభరోసా పథకాన్ని నెల్లూరు జిల్లా వేదికగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రైతు బిడ్డగా నెల్లూరు జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 

నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులకు చెక్ లు అందజేశారు సీఎం జగన్. దేశంలో ఏ రాష్ట్రం రైతులకు ఇవ్వని విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలు ఉన్నామని వారి బాధలు కళ్లారా చూశానని తెలిపారు. 

గ్రామగ్రామాన రైతుల కష్టాలను చూశానని వారి ఆవేదనను చూసినట్లు తెలిపారు. వర్షాలు లేక కొందరు, పెట్టుబడి సాయంలేక మరికొందరు పడుతున్న ఆవేదనలను తాను చూసినట్లు తెలిపారు. బ్యాంకులు సైతం పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేని దుస్థితిని చూశానని అలాంటి పరిస్థితి లేకుండా చూడాలన్న లక్ష్యంతోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు సీఎం జగన్. 

ప్రతీ ఏటా రైతులకు మూడు విడతలుగా రూ.13,500 రూపాయలు చెల్లిస్తానని స్పష్టం చేశారు. 2017 జూలై 8న గుంటూరు జిల్లా మంగళగిరిలో వైయస్ఆర్ రైతు భరోసా పథకంపై ప్రకటన చేసినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలో భాగంగా వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

వైయస్ఆర్ రైతు భరోసా పథకం ప్రకటించిన తర్వాతే తాను పాదయాత్ర చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 70శాతం మందికి ఒక హెక్టారుకు కూడా భూమిలేదని అలాగే 50 శాతం మంది రైతులకు అరహెక్టార్ లోపే భూమి ఉందన్నారు.