కేసులో ఏ1 చంద్రబాబే: ఆయనపై నమోదైన సెక్షన్లు ఇవే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. చంద్రబాబు సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసినట్టుగా చేసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుతో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాలలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు.
చంద్రబాబుపై ఐపీసీలోని 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34, 37, 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సీ),(డీ) నమోదు కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నేరం కింద కేసు నమోదైనట్టుగా ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఏపీ సీఐడీ 2021 డిసెంబర్ 9న కేసు నమోదు చేసింది. ఇందులో 25 మంది నిందితులను పేర్కొంది. కానీ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చలేదు. అయితే విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ పేర్కొంది. ఇక, ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.
తెల్లవారుజాము నుంచే..
చంద్రబాబు ‘బాబు ష్యూరిటీ-భవిష్యతుకి గ్యారెంటీ’లో భాగంగా నాయుడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి నంద్యాలలో చంద్రబాబు బస చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలో నంద్యాల జిల్లా పోలీసులతో పాటు సీఐడీ సిబ్బంది తెల్లవారుజామున 3 గంటలకు క్యాంపు స్థలానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.