4 గంటలుగా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు.. కుటుంబ సభ్యులనూ అనుమతించని పోలీసులు, సీఐడీ వ్యూహమేంటీ..?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు గంటలుగా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటల నుంచి చంద్రబాబును కార్యాలయంలోనే వుంచారు అధికారులు. అయితే తనకు లాయర్లను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు సిట్ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు లోకేష్‌ను కూడా కలవడానికి అనుమతించడం లేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రస్తుతం సిట్ కార్యాలయంలోని నాలుగో అంతస్తులో వున్నారు.
మరోవైపు సీఐడీ అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుస్తామని చెప్పిన అధికారులు ఆలస్యం చేయడంపై వారు మండిపడుతున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు భారీగా చేరుకుంటూ వుండటంతో సిట్ కార్యాలయం పరిసరాల్లో భారీగా మోహరించారు. అటు పోలీసులు కోర్టులో చంద్రబాబును హాజరుపరిస్తే ఆయన తరపున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్ట్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సిద్ధంగా వున్నారు. అయితే సీఐడీ అధికారుల వ్యూహం మాత్రం వేరోలా వుందని తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు కాన్వాయ్ నంద్యాల నుంచి విజయవాడ (ఫొటోలు)
కాగా.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు శనివారం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి తరలించారు. మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నప్పటికీ.. వాటిని క్లియర్ చేసుకుంటూ సాయంత్రం 5.10కి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. ఆయన రాకకు ముందే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, నేతలు కూడా సీఐడీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు.
మరోవైపు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఐడీ సమర్పించిన ఆధారాలు, ఇరువైపుల వాదనల అనంతరం.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే దానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.