Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్‌కు భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు.. ఫలించిన బాబు వ్యూహం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ వ్యుహాం ఫలించింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.

TDP candidate Panchumarthi Anuradha Wins In MLA Quota MLC Elections ksm
Author
First Published Mar 23, 2023, 6:44 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ వ్యుహాం ఫలించింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. వైసీపీకి అనుకూలమని భావించిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీ అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్ చేసినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద 7 స్థానాలకు వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించడంతో.. వైసీపీ నుంచి ఆరుగురు మాత్రమే గెలుపొందే అవకాశం ఉంది. ఇక, అనురాధ గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేశారు. 

ఫలించిన చంద్రబాబు వ్యుహం.. 
అసెంబ్లీలో సాంకేతికంగా వైసీపీకి 151 మంది ప్రజాప్రతినిధులు, టీడీపీకి 23 మంది, జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే టీడీపీ నుంచి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు..  వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌లు వైసీపీకి మద్దతు తెలిపారు. జనసేన నుంచి గెలుపొందిన రాపాక కూడా వైసీపీకి అనుకూలంగా మారారు. దీంతో వైసీపీ బలం 156కి చేరింది. దీంతో టీడీపీ బలం 19కే పరిమితం అయింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను బరిలో దింపారు. 

దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థికి 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలపై దృష్టి సారించారనే వార్తలు  వినిపించాయి.  వైసీపీ రెబల్స్‌గా మారిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి‌ల ఓటు తమకే దక్కుతుందనే ధీమాను టీడీపీ వర్గాలు వ్యక్తం చేశాయి. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తమతో టచ్‌లో ఉన్నారనే.. తమ అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చాయి. 

మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి చేదు అనుభవం ఎదురుకావడంతో.. సీఎం జగన్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ మొత్తం 154 ఓట్లు(156- ఇద్దరు వైసీపీ రెబల్స్) చేజారకుండా పలు జాగ్రత్తలు తీసుకుంది. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలపై నిఘా కూడా పెట్టింది. 22 మంది ఎమ్మెల్యేలను ఒక్కో గ్రూప్‌గా విభజించి.. పక్కా స్కెచ్ వేసింది. 

అయితే వైసీపీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుె  ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు వైసీపీకి మద్దతుగా ఉన్న మరో ఇద్దరు కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు వ్యుహం ఫలించిందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios