ఎమ్మెల్సీ ఎన్నికలు : పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం కైవసం.. మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ సైకిల్ పాగా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ టీడీపీ విజయం సాధించింది. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి 7,543 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో ఇప్పటికే గెలిచిన టీడీపీ.. తాజాగా పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి 7,543 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం కూడా కొనసాగుతోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. 2,45,687 ఓట్లు పోలవ్వగా వీటిలో 2,26,405 ఓట్లు చెల్లుబాటైనట్లుగా అధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కొనసాగిస్తున్నారు. ఈ స్థానంలో 49 మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. ఏ అభ్యర్ధికి సరైన మెజార్టీ లేకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం రామ్‌గోపాల్ రెడ్డి గెలిచినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మీ ప్రకటించారు. భూమిరెడ్డికి 1,09,781 ఓట్లు, రవీంద్రా రెడ్డికి 1,02,238 ఓట్లు పోలయ్యాయి.
అయితే కౌంటింగ్ తీరుపై వైసీపీ అభ్యర్ధి రవీంద్రా రెడ్డి , మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసింది వైసీపీకేనని, నైతిక విజయం తమదేనని వారు పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు తామే ఆధిక్యంలో వున్నామని.. బీజేపీకి వచ్చిన ఓట్లు షేర్ చేయడంతో టీడీపీ అభ్యర్ధికి లీడింగ్ వచ్చిందని వారు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు. అంతేకాదు కౌంటింగ్ కేంద్రంలో వీరిద్దరూ ఆందోళన నిర్వహించారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని .. ఏమైనా వుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో రవీంద్రారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిలు నిరసన విరమించారు.
ALso REad : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు : పశ్చిమ రాయలసీమలో టీడీపీ లీడింగ్, వైసీపీ అభ్యర్ధి ఆరోపణలు
అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలోనూ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ విజయం సాధించారు. విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతాన్ని టిడిపి అభ్యర్థి చిరంజీవి రావు తొలి ప్రాధాన్యంలోనే సాధించారు. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయం సాధించాలంటే 94,509 కోట ఓట్లు అవసరం. కాగా, చిరంజీవిరావుకు 82, 958 ఓట్లు మొదటి ప్రాధాన్యంలో వచ్చాయి.
పశ్చిమ రాయలసీమ విషయానికి వస్తే.. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్సీపీలు పోటీ పడ్డాయి. తాజా ఫలితాల్లో తూర్పు రాయలసీమ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత రాత్రి స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ నాయకులు బాణసంచా కాల్చి, డాన్సులు చేస్తూ విజయ సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జై కొడుతూ.. టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.