టీడీపీ, బీజేపీ పొత్తు... లాభం ఎవరికి?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ పొత్తులు దాదాపు ఖరారైనట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఈ పొత్తు వల్ల ఎవరు లాభపడనున్నారు?
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పొత్తు పొడుపులు పొడవనున్నాయా? 2014 ఎన్నికల్లో బెడిసి కొట్టిన ఆ పాత పొత్తు మళ్లీ తెర మీదికి రానుందా? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా.. పొత్తుల కూటమి ఏర్పడనుందా? గతవారంలో చంద్రబాబు నాయుడు అమిత్ షా తో భేటీ, ఆ వెంటనే పవన్ కళ్యాణ్, అమిత్ షా తో భేటీ.. దేనికి సంకేతాలు? మరోవైపు ఓ చోట మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్న టిడిపితో పొత్తు విషయంలో చెప్పీ, చెప్పకనే చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదని.. కుటుంబాన్ని పెంచుకుంటూ పోవడమే ఉంటుందని నర్మ గర్భంగా మాట్లాడారు.
అయితే, ఇప్పటికే టిడిపి-జనసేన కూటమిగా మారింది. దీంట్లో కొత్తగా బిజెపి చేరబోతుంది. దీంతో, టీడీపీ-జనసేన-బిజెపి కూటమిగా మారబోతున్నాయి. నిజానికి పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు అంటే.. ఒంటరిగా బరిలోకి దిగడం కంటే పొత్తులో భాగంగా బరిలోకి దిగితే మరింత లాభం చేకూరుతుందనే. ఉమ్మడి శత్రువు ఒక్కడే అయినప్పుడు.. కలిసి వెళ్లడం వల్ల మరింత బలం చేకూరుతుందని, అంతిమ లక్ష్యాన్ని ఈజీగా అందుకోవచ్చని.
చంద్రబాబు లగ్జరీ చూసి ప్రధానే ఆశ్చర్యపోయేవారు... తమతో ఇలాగనేవారు..: కేశినేని నాని
మరి ఇప్పుడు కొత్తగా టిడిపి-బిజెపి పొత్తు వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది? ఈ విషయం ఒకసారి గమనిస్తే.. 2019 ఎన్నికల్లో టిడిపికి 39 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వైసిపిలో మార్పులు, చేర్పులు.. సంక్షేమ పథకాలు సరిగా అమలు కాలేదన్న వ్యతిరేకత.. అర్బన్ లో వైసీపీకి ఉన్న వ్యతిరేకత అంతా టిడిపికి ఓటు బ్యాంకుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇండియా టుడే తాజా సర్వేలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 25 సీట్లలో టిడిపి 17 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మరోవైపు 2019 ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్ల శాతం 0.84 మాత్రమే. ఇంకా చెప్పాలంటే బిజెపి కంటే ఎక్కువగా నోటాకు 1.24శాతం ఓట్లు వచ్చాయి. ఐదేళ్లలో బీజేపీ ఓట్ల శాతం ఏమైనా పెరిగిందా అంటే.. పెద్దగా లేదనే తెలుస్తోంది. ఆంధ్రాలో బిజెపిని ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీగానే చూస్తుండడంతో.. బిజెపికి ఈసారి ఒక్క లోక్సభ సీటు కూడా రాదని ఇండియా టుడే తాజా సర్వే తేల్చింది.
ఓట్ల శాతంలో కాస్త పురోగతి కనిపిస్తోందని.. ఈసారి 2.1% ఓట్లు బిజెపికి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం ఈ ఓట్ల శాతం ఇంకా తగ్గే అవకాశం ఉందని చెబుతోంది. మరి ఇప్పుడు ఓట్ల శాతం విషయంలోనూ, ప్రజల్లో ఆదరణ విషయంలోనూ పై స్థాయిగా ఉన్న టిడిపి బిజెపితో పొత్తుకు ఎందుకు ముందుకు వస్తోంది? ఇప్పటికే తాను పొత్తు పెట్టుకున్న జనసేన పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లనా? లేక బిజెపితో సఖ్యత లేకపోతే ఎన్నికల కమిషన్ తమకు వ్యతిరేకంగా ఉంటుందని భయమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీ వ్యతిరేక మైనారిటీ ఓటు బ్యాంకు టిడిపికి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ఎన్నికల తర్వాత బిజెపికి మద్దతిస్తామని చెప్పినా అగ్ర నేతలు వినిపించుకోవడంలేదని సమాచారం. దీనికి కారణం ఉంది.. ఈ పొత్తు వల్ల బిజెపి లాభపడే అవకాశాలున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కాస్త ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తద్వారా బీజేపీ బలపడుతుంది. దీంతో కేంద్రంలో బిజెపి సంఖ్యాబలం పెరుగుతుంది.
ఇక మరోవైపు టీడీపీ-జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్న క్రమంలో.. బిజెపి అందులో తాను భాగం కావాలనుకుంటుంది. టిడిపి-జనసేన ఉమ్మడిగా బరిలో దిగినా.. టిడిపికి జనసేన మద్దతు అవసరం లేనన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఒక టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో పొత్తులో ఉండడం వల్ల లాభపడేది అంతిమంగా బిజెపినే.
ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే పొత్తు సమయంలో బిజెపి ఎక్కడైనా మామూలుగా లోక్సభ స్థానాలు ఎక్కువగాను, అసెంబ్లీ స్థానాలు తక్కువగా తీసుకుంటుంది. కానీ, ఇక్కడ టిడిపి దగ్గరికి వచ్చేసరికి లోక్సభలో ఎక్కువ సీట్లు అడగడమే కాకుండా.. అసెంబ్లీలో కూడా వీలైనంత ఎక్కువ సీట్లు కావాలనే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జనసేన తనకిచ్చిన స్థానాల కంటే ఇంకొన్ని ఎక్కువ అసెంబ్లీ సీట్లు కావాలని అడుగుతుంది, ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరితే.. వాళ్లు అడిగే అసెంబ్లీ స్థానాలతో కలిస్తే.. మ్యాజిక్ ఫిగర్ కు టిడిపి దూరమవుతుంది.
ఇక ఇంకో విషయానికి వస్తే.. బిజెపితో కలవడం వల్ల ఒకవేళ వైసీపీ వ్యతిరేకతతో టిడిపి వైపు చూడాలనుకున్న మైనారిటీ ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుంది. ఇలా ఎలా చూసినా బీజేపీతో కలవడం వల్ల లాభపడేది బిజెపి మాత్రమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.