అమరావతి:  ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎన్నికలను అడ్డుకొన్నారని ఆయన విమర్శించారు. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలను కూడా భాగస్వామ్యులు చేశారని ఆరోపించారు. 

ప్రజల మద్దతుంటే ఎన్నికల విషయంలో భయమెందుకని ఆయన ప్రశ్నించారు.  కరోనా పేరుతో ఎన్నికలను వద్దంటున్న సర్కార్ అమ్మఒడి సభను నెల్లూరు వేలాది మందితో ఎలా నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. 

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే ఎన్నికలు జరిగితే తమ అరాచకాలు సాగవనే భయంతోనే ఈ ఎన్నికలను అడ్డుకొన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఏపీ ఎస్ఈసీ తీసుకొన్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు  ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సోమవారం నాడు ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది.