జగన్ భజన చేసేందుకే డిజిటల్ కార్పొరేషన్... అప్పనంగా బొక్కేసిన ప్రజాధనం కక్కిస్తామంటున్న టీడీపీ

‘‘అస్మదీయులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిన ప్రభుత్వం జగన్ రెడ్డిదే. కంటెంట్ కార్పొరేషన్‌గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌గా పేరు మార్చి.. వైసీపీ సోషల్ మీడియా టీమ్, సాక్షిలో పనిచేసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందులోనూ జగన్‌కు డబ్బా కొట్టించుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు...’’ 

TDP angry over digital corporation loopholes GVR

గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి... 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చీరాగానే తవ్వకాలు ప్రారంభించింది. ప్రజాధనాన్ని లూటీ చేసిన అన్ని వక్ర మార్గాలను వెలుగులోకి తీసుకొస్తోంది. 
 
గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్లను జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారని ఆరోపిస్తున్నారు. కంటెంట్ కార్పొరేషన్‌గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌గా పేరు మార్చి కోట్ల రూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఒక చిన్న కార్పొరేషన్‌లో 129మంది ఉద్యోగులను చేర్చి లక్షల్లో జీతాలు చెల్లించారని... అందులోనూ సగం మందికి ఆఫీసుకు రాకుండా జీతాలు చెల్లించడమంటే మామూలు విషయం కాదని మండిపడుతున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్, వైస్ చైర్మన్ల ఇళ్లలో ట్యూషన్ చెబుతున్న టీచర్లకు కార్పొరేషన్ నుండి జీతాలు చెల్లించారని...  ప్రకటనల పేరుతో సాక్షి పేపర్‌, ఐ ప్యాక్‌కు  కోట్లు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్‌ నడుపుకునే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి ఇదంతా చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

అస్మదీయులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి కోట్ల రూపాయల  ప్రజాధనం కొల్లగొట్టిన  ప్రభుత్వం జగన్ రెడ్డిదేనని విజయ్ కుమార్ విమర్శించారు. కంటెంట్ కార్పొరేషన్‌గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌గా పేరు మార్చి.. వైసీపీ సోషల్ మీడియా టీమ్, సాక్షిలో పనిచేసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అందులోనూ జగన్‌కు డబ్బా కొట్టించుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. 

విజయ్‌ కుమార్‌ ఇంకా ఏమన్నారంటే....

‘‘వైసీపీలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కార్పొరేషన్ పెట్టి ఏరకమైన క్వాలిఫికేషన్ లేకుండా.. ఉద్యోగుల్లో మూడోవంతు ఆఫీసుకు రాకుండా లక్షల జీతాలు చెల్లిస్తూ దోచిపెట్టారు. అస్మదీయులకు ఉద్యోగాలు కట్టబెట్టి, అక్రమంగా యాడ్‌లు ఇచ్చి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు. వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కొర్పొరేషన్‌ను ఉద్యోగ పునరావస కేంద్రంగా వాడుకున్నారు. తమ వారికోసం ఏకంగా ఒక కార్పొరేషన్ పెట్టిన ఘనుడు జగన్.
ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా కొల్లగొట్టారు. ప్రభుత్వం మారిన వెంటనే  సగం మంది రిజైన్ చేసి వెళ్లిపోయారు. దోచుకున్నన్ని రోజులు దోచుకుని ప్రభుత్వం మారగానే పారిపోయారు. సాక్షికి ఇచ్చే యాడ్లకే కాకుండా జగన్ రెడ్డికి మేలు చేసేందుకు గూగుల్ యాడ్లకోసం కోట్లు ఖర్చు పెట్టారు. డిజిటల్ కార్పొరేషన్ ను అస్తవ్యస్తంగా తయారు చేసి దోచుకున్నారు.‘‘

‘‘డిజిటల్ కార్పొరేషన్‌లో చేరిన చాలామంది ఉద్యోగులకు ఎలాంటి అర్హత లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లలో పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లను టిజిటల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులుగా చూపించి జీతాలు చెల్లించారు. 129 మందిలో 49 మంది ఆఫీసుకే రారు. కార్పొరేషన్‌లో కపుల్ పాలసీ కూడా ఉంది. భర్త ఉద్యోగానికి వస్తే భార్య ఆఫీసుకు రానక్కరలేదట. అలాగే ఫ్యామిలీ పాలసీని కూడా తీసుకొచ్చారు. సిస్టమ్స్ మెయింటన్ చేసే వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలిచ్చారు. ఒకే పనిచేసేవారికి ఒకే రకమైన జీతాలు లేవు. ఒక వ్యక్తి రూ.లక్ష ఇస్తే మరో వ్యక్తికి రూ.40వేలు ఇచ్చారు. ఇంకొకరికి రూ.23వేలు ఇచ్చారు. జగన్‌కు భజన చేసేందుకు నాలుగేళ్లలో రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కొల్లగొట్టారు. 500 వెబ్‌సైట్లకు డబ్బులిచ్చి కార్పొరేషన్ డబ్బులను దోచిపెట్టారు. గూగుల్‌తో పాటు ఐ ప్యాక్‌కు కూడా యాడ్స్ రూపంలో కార్పొరేషన్ నుంచి డబ్బులు చెల్లించి జగన్ రెడ్డికి డబ్బాకొట్టారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు.’’

‘‘బయట సాక్షి పేపర్ ఎలా ఉందో... ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్‌నను అలా తయారుచేశారు. అందులో ఉండేవారందరూ సాక్షి సోషల్ మీడియాలో పనిచేసేవారే. ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం కోసం అంటూ జగన్ కోసం పనిచేశారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. డిజిటల్ కార్పొరేషన్‌లో అంతా ఖర్చే ఆదాయం లేదు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చేసింది జగన్ రెడ్డికి డబ్బా కొట్టడమే. ఇది ఒక  కార్పొరేషన్ చేయాల్సిన పనేనా? కార్పొరేషన్ ఎందుకు పెట్టారు? జగన్ రెడ్డికి వ్యక్తిగత పూజ చేయడానికా? ఒక ప్రభుత్వ కార్పరేషన్‌గా ఉండి గూగుల్‌లో పొలిటికల్ యాడ్స్ ఇవ్వొచ్చా అనేది ప్రశ్న. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన యాడ్స్ ను గూగుల్ ఎందుకు తొలగించింది. జగన్ రెడ్డికి డబ్బాకొట్టే యాడ్ లు అనే కదా?’’

డిజిటల్ కార్పొరేషన్ ఏం చేయాలి..? 
‘‘డిజిటల్ కార్పొరేషన్ పల్లెల్లో  డిజిటల్ లైబ్రరీలను పెట్టాలి. గ్రామాల్లో డిజిటల్ క్లాసుల ఏర్పాటు కోసం కృషి చేయాలి. కానీ అది ఎక్కడా కనిపించలేదు. డిజిటల్ లైబ్రీలకు కేటాయించిన రూ.750 కోట్లు సొమ్ములు ఏమైయ్యాయో తెలియదు. జగన్‌కు భజన చేసి అప్పనంగా బొక్కేసిన సొమ్మంతా మాఫీ కావాల్సిందేనా?. ప్రశ్నించినందుకు నాకు నోటీసులు ఇచ్చిన చిన్న వాసుదేవరెడ్డి అంతా కరెక్ట్ గా చేస్తే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది’’ అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. టీడీపీ నేతలపై నోరు పారేసుకున్న చిన్న వాసుదేవెడ్డి, దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి నేతలను జగన్ రెడ్డి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా పోషించారని ఆరోపించారు. దీనికి సహకరించిన అధికారులు, దోచుకున్న నేతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios