విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ధ్వజమెత్తారు. మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోమనండి అంటూ వ్యాఖ్యానించారు. .బస్ వేసుకొని తిరిగి తిరిగి చోటల్లా రాజధాని చెప్పమనండని అన్నారు.

ఎక్కడి నుండి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందని కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన రాజధానులు కావని ఆయన అన్నారు. మంచికో , చెడుకో అమరావతి  రాజధాని అంటూ సుమారుగా ప్రజాధనం ఏడు వేల కోట్లు పెట్టారని, మరో రెండు వేల కోట్లు పెడితే అది పూర్తవుతుందని ఆయన చెప్పారు. 

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్యను తెస్తూనే ఉన్నారని, గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ప్రభుత్వం అరెస్టు చేసిందని, ప్రతిపక్షంలో ఉండే వాళ్లే ప్రత్యేక హోదా అడగ మంటున్నారని ఆయన అన్నారు.

రాజధాని విషయం పక్కన పెడితే, అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకున్నారని,  తెలుగు వాడమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందని, ముందు సంస్కారవంతులుగా మారాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిలో కేవలం సచివాలయాన్ని మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. కర్నూలుకు హైకోర్టును తరలించాలని, విశాఖ పట్నాన్ని కార్యనిర్వహణ రాజధానిగా చేయాలని తలపెట్టారు.