విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుడిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహనరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

గతంలో పి.రామ్మోహన్ రావు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. సోమవారం ఉదయం పార్టీలో చేరిన ఆయనను పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ అడ్వైజర్ గా నియమించారు. 

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్మోహన్ రావు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రూపకర్త అని ఆయన సూచనలు సలహాలు జనసేన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని తాను ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

తనను రాజకీయ సలహాదారుడిగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ కు రామ్మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నారని స్పష్టం చేశారు. 

ఎవరో ఒకరు తమను రక్షించబోతారా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన్ను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమంపై పవన్ కళ్యాణ్ కు అత్యున్నత ఆశయాలు ఉన్నాయని తెలిపారు. 

మానవసేవే మాధవ సేవే అన్న నినాదాన్ని నిజం చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అలాంటి వ్యక్తితో తాను కలిసి పనిచేయ్యడం సంతోషంగా ఉందని పి.రామ్మోహన్ రావు తెలిపారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసే వరకు తాను అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. 

ఇకపోతే పి.రామ్మోహన్ రావు 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ లో పలు పదవుల్లో సేవలందించారు. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

అన్నా డీఎంకే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారని ఆయనకు మంచి పేరుంది. 

కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. వ్యవసాయ శాఖ, సంక్షేమ రంగాలపై పి.రామ్మోహన్ రావుకు మంచి పట్టుంది. అంతేకాకుండా సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, గుజరాత్ మారిటైమ్ బోర్డులో వైస్ చైర్మన్ గా పనిచేశారు పి. రామ్మోహన్ రావు.