తాడికొండ : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై వివాదం కొనసాగుతున్న వేళ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసిపి గెలిచినా ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే టిడిపిలో కొనసాగుతున్నారు. అలాగని టిడిపి టికెట్ ఆమెకు దక్కిందా అంటే అదీ లేదు. అటు వైసిపి, ఇటు టిడిపి టికెట్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు దక్కలేదు... కానీ ఎన్నికల ఫలితంపై ఆమె ప్రభావం వుండనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలా తాడికొండ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతుండటంతో ఎన్నికల ఫలితంపై ఆసక్తి నెలకొంది.
తాడికొండ అసెంబ్లీలో ఆసక్తికర రాజకీయాలు :
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడికొండ పేరు ఎక్కువగా వినిపించింది. ఈ ఎన్నికల్లో టిడిపికి గెలిచేంత బలం లేకున్నా అభ్యర్థిని పోటీలో నిలిపి విజయం సాధించింది. తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపికి ఓటు వేసినట్లు ఆరోపిస్తూ వారిని పార్టీనుండి సస్పెండ్ చేసారు. అంతేకాదు వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరింది అధికార పార్టీ. తాజాగా వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసారు. ఇలా అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు.
ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాలతో వైసిపికి దూరమైన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి టిడిపిలో చేరారు. దీంతో ఈసారి ఆమె టిడిపి నుండి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం శ్రీదేవిని కాకుండా గతంలో ఆమెపై పోటీచేసి ఓడిన తెనాలి శ్రవణ్ కుమార్ నే బరిలోకి దింపారు.
తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. తాడికొండ
2. తుళ్లూరు
3. ఫిరంగిపురం
4. మేడికొండూరు
తాడికొండ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
తాడికొండ వైసిపి అభ్యర్ధి :
ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ వీడటంతో వైసిపి కొత్త అభ్యర్థిని తాడికొండ బరిలోకి దింపుతోంది. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను వైసిపి అభ్యర్థిగా ప్రకటించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో బలమైన మహిళా నాయకురాలిని పోటీలో నిలిపింది వైసిపి.
తాడికొండ టిడిపి అభ్యర్థి :
టిడిపి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తాడికొండ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఈయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో తనపై పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి వైసిపిని వీడి టిడిపిలో చేరడం కలిసివస్తుందని శ్రవణ్ భావిస్తున్నాడు.
తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 :
గుంటూరు జిల్లాలో ఎస్సీలకు కేటాయింపబడిన ఈ తాడికొండ నియోజకవర్గంలో 2019 ఎన్నికల ప్రకారం 2,00,065 మంది ఓటర్లు వున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు ఇలా వున్నాయి.
వైసిపి - వుండవల్లి శ్రీదేవి - 86,848 ఓట్లు (48 శాతం) గెలుపు
టిడిపి - తెనాలి శ్రవణ్ కుమార్ - 82,415 ఓట్లు (46 శాతం) ఓటమి
తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 :
ఈ ఎన్నికల్లో మొత్తం 1,59,473 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు... అంటే 89 శాతం పోలింగ్ నమోదయ్యింది.
టిడిపి - తెనాలి శ్రవణ్ కుమార్ - 80,847 (50 శాతం) గెలుపు
వైసిపి - కథేరా హేనీ క్రిస్టినా - 73,305 ఓట్లు (45 శాతం) ఓటమి
