Asianet News TeluguAsianet News Telugu

హిందూపురం లాడ్జిలో.. తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి...రూంలో మరొక వ్యక్తి...

ఓ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి ఇప్పుడు హిందూపురంలో కలకలం రేపుతోంది. తెలంగాణకు చెందిన ఆమె, మరో స్నేహితుడితో కలిసి హిందూపురం వచ్చారు. ఆ తరువాత సాయంత్రానికి శవంగా మారింది.  

Suspicious death of a medical student in Hindupuram lodge, andhrapradesh
Author
First Published Aug 25, 2022, 6:43 AM IST

హిందూపురం : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఓ లాడ్జిలో తెలంగాణాకు చెందిన వైద్య విద్యార్థిని ఒకరు బుధవారం అనుమానాస్పద స్థితిలో  మృతి చెందింది. టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తిచేసి కర్ణాటకలోని చిక్కబల్లపుర మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. భర్త వరంగల్లో ఆర్థోపెడిక్ వైద్యుడు.  ఆమె తన స్నేహితులైన సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మహేష్ వర్మ (25)తో కలిసి బుధవారం ఉదయం హిందూపురం వచ్చి ఓ లాడ్జిలో దిగారు.

సాయంత్రానికి అక్షిత చనిపోయినట్లు ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసి తెలిపాడు. మధ్యాహ్నం భోజనం చేసి తామిద్దరం నిద్ర పోయామని,  లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని తెలిపాడు. పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహేశ్ వర్మ హైదరాబాదులో ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్నట్లు తెలిసింది. అక్షితకు ఏడాది వయసున్న కుమార్తె ఉంది. స్నేహితుడితో కలిసి ఒంటరిగా ఇక్కడికి వచ్చిందని సిఐ తెలిపారు. అక్షిత మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని  అన్నారు. 

ప్రకాశంలో ఆర్మీ జవాన్ సూర్యప్రకాష్ రెడ్డి సూసైడ్: న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆందోళన

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ 23న అనంతపురంలో చోటు చేసుకుంది. గోరంట్ల మండలంలోని చింతలపల్లికి చెందిన ప్రియురాలు బోయ రామకుమారి ఇంట్లో ప్రియుడు ఈడిగ సురేష్ (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై ఇక్బాల్ బాషా  తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కాసిరాళ్ల గ్రామానికి చెందిన వేణుమూర్తి, కుమారుడు సురేష్ పలమనేరులోని కోళ్ల ఫారంలో పని చేసేవాడు. చింతలపల్లికి చెందిన రామకుమారి ఉపాధి కోసం వలస వెళ్లి, అక్కడే పనిచేసేది. ఆమె 50 ఏళ్ల వితంతువు. ఆమెకు సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన చెల్లెలు కుమార్తెతో సురేష్ కు పెళ్లి చేస్తానని నమ్మించింది.  

రామకుమారి కూడా పని వదిలేసి సురేష్ ను చింతలపల్లికి తీసుకు వచ్చింది. ఆ తరువాత గ్రామంలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేసేవారు. సురేష్ తాగుడుకు బానిసయ్యాడు. సురేష్ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం కొడుకును తీసుకువెళ్లాలని గ్రామానికి వచ్చారు. సురేష్ చావనైనా చస్తాను గాని.. తాను వచ్చేది లేదంటూ కత్తితో కోసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇటీవల పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్న సురేష్ శనివారం రాత్రి రోజూలాగే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం ఎంతసేపటికి లేవలేదు.

ఆ తర్వాత అతను మృతి చెందినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు చింతలపల్లికి వచ్చారు.  అనారోగ్యంతోఉన్న తన కుమారుడికి చికిత్స చేయించకుండా మృతికి కారణమైన వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సురేష్ మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో  సోమవారం  పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుఎస్ఐ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios