రుణాల ఎగవేత కేసులో బెయిల్‌పై వున్న ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఇకపై ప్రతి 10 రోజులకొకసారి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
రుణం ఎగవేత కేసులో ఏపీ బీజేపీ (bjp) ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి (vakati narayana reddy) శుక్రవారం సుప్రీంకోర్టులో (supreme court) భారీ ఊరట లభించింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నారాయణ రెడ్డి ఇకపై ప్రతి 10 రోజులకొకసారి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు బెయిల్ షరతులను సడలిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా 2017లో నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ (tdp) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వాకాటి. వివిధ బ్యాంకుల నుండి వాకాటి సుమారు రూ.190 కోట్లు రుణంగా తీసుకున్నారు. అయితే, తీసుకున్న రుణాన్ని చెల్లించకుండా ఎగొట్టారు. దాంతో బ్యాంకులు వాకాటిపై ఫిర్యాదు చేశాయి. ఆ కేసు సిబిఐకి (cbi) చేరింది. దాంతో సిబిఐ రంగంలోకి దిగింది. వాకాటి తీసుకున్న రుణం రూ. 190 కోట్లు కాస్త ఇపుడు రూ. 205 కోట్లకు చేరుకున్నది. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేయటం, ఆస్తుల విలువ అసలుకన్నా ఎక్కువగా చూపించటం, తీసుకున్న రుణాలను ఎగ్గొట్టటం లాంటి ఆరోపణలను వాకాటి ఎదుర్కొంటున్నారు.
దీంతో కొంతకాలం పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న వాకాటి.. టీడీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత నారాయణ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో ఆయన బీజేపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. రుణం ఎగవేత కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న వాకాటి చాలా కాలంగా బయట కనిపించడం లేదు.
అయితే ప్రతి 10 రోజులకొకసారి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయడం తనకు ఇబ్బందిగా ఉందంటూ వాకాటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇప్పటిదాకా తాను బెయిల్ షరతులను ఏమాత్రం ఉల్లంఘించలేదని తెలిపారు. దీనిపై సంతృప్తి చెందిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతి 10 రోజులకొకసారి సీబీఐ కార్యాలయానికి వెళ్లాలన్న నిబంధనను తొలగించింది.
