మదనపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో వైసిపి ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ వైసిపి వశమయ్యాయి. వైసిపి దాటికి ప్రతిపక్షాలు చిత్తుచిత్తయ్యాయి. ఇక ఇండిపెండెంట్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో అయితే స్వతంత్రులుగా పోటీచేసిన వారు, ప్రజల్లో అంతగా ఆదరణ లేని పార్టీలు దారుణ ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. 

చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ 16వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీంద్ర నాయుడు మరీ దారుణంగా ఓటమిపాలయ్యారు. అతడికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. తన ఓటు కూడా తాను వేసుకోలేడా అన్న అనుమానం కలగొచ్చు. అయితే అతడికి ఆ వార్డులో ఓటు లేదు. వేరే వార్డులో వుంది. దీంతో కనీసం ఒక్కఓటు కూడా పడకుండా ఘోర పరాభవాన్ని చవిచూశాడు. 

ఇక ఇదే మదనపల్లి మున్సిపాలిటీలో బిఎస్పీ(బహుజన్ సమాజ్ వాది పార్టీ) తరపున రెండో వార్డులో పోటీకిదిగిన అభ్యర్థి పవన్ కుమార్ పరిస్థితి మరీ దారుణం. అతడి కేవలం ఒకే ఒక ఓటు పడింది. కుటుంబంతో సహా అదే వార్డులో నివాసముంటున్నాడు. వీరందరికీ ఇదే వార్డులో ఓట్లున్నాయి. అయినా ఒక్క ఓటు పడిందంటే తన ఓటు మాత్రమే తాను వేసుకున్నాడన్నమాట. కుటుంబసభ్యులు సైతం అతడికి ఓటెయ్యలేదనేది ఈ ఫలితాన్ని బట్టి అర్థమవుతుంది.  

అలాగే ఇదే మున్సిపాలిటీలో బీఎస్పీ తరఫున ఒకటో వార్డులో బరిలోకి దిగిన కందూరు సహదేవుడుకు 2 ఓట్లు మాత్రమే లభించాయి. ఆయనకు ఈ వార్డులో ఓటు లేదు. ఇలా మదనపల్లి మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితాలు వెలువడ్డాయి.