Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో రాళ్ళ దాడుల రాజకీయాలు ... ఒక్క చంద్రబాబుపైనే ఇన్నిసార్లా...!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాళ్లదాడుల రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లతో పాటు మాజీ సీఎం చంద్రబాబుపైనా రాళ్లదాడులు జరిగాయి. అయితే ఈ రాళ్లదాడుల రాజకీయాల్లో ఎక్కువగా బాధితుడిగా మారింది మాత్రం చంద్రబాబు నాయుడే... 

stone attack on Telugu Desam Chief Chandrababu Naidu in Visakhapatnam AKP
Author
First Published Apr 15, 2024, 8:48 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళుతుండగా వారిపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. ఇలా ఇప్పటికే విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెనాలిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై రాళ్లదాడి జరిగింది. నిన్న రాత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కూడా విశాఖ జిల్లా గాజువాకలో కొందరు రాళ్ళతో దాడికి దిగారు. 

గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపైకి రాళ్లు విసిరారు. కానీ ఆ రాళ్లు చంద్రబాబు వరకు చేరకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాళ్లదాడిని గుర్తించిన చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అలాగే టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా చంద్రబాబుపై రాళ్లదాడికి యత్నించిన వారిని పట్టుకునే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే వాళ్లు పారిపోయారు.  

అయితే తనపై జరిగిన రాళ్లదాడిపై చంద్రబాబు స్పందించారు.''చూడండి... తనపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అరెయ్... మిమ్మల్సి ప్రజలు వదిలిపెట్టరు... తరిమితరిమి కొడతారు. చిల్లర పనులు చేసేవారిని ప్రజలు బట్టలూడదీసి కొడతారు. వైసిపి గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చింది. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్థంకావడం'' అంటూ గాజువాక ప్రచారంలోనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

 

చంద్రబాబుపై ఇప్పటివరకు జరిగిన రాళ్ల దాడులు : 
 
అంగళ్లు : 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై గతేడాది కూడా రాళ్లదాడి జరిగింది.  ఆగస్ట్ 4 , 2023 లో  ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో రాళ్లదాడి జరిగింది. ఈ దాడి నుండి కూడా చంద్రబాబు సురక్షితంగా బయటపడ్డారు.  

అయితే చంద్రబాబుపై రాళ్లదాడిలో అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది సాధారణ రాళ్లదాడి కాదు... తనను చంపేందుకు జరిగిన కుట్ర అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షన చెలరేగింది. అయితే అంగళ్లులో ఉద్రిక్తతలకు కారణం చంద్రబాబే అంటూ పోలీసులు కేసులు పెట్టారు. 

తిరుపతి : 

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతిచెందడంతో 2021లో ఈ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనూ చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది.పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై రాళ్లు విసిరారు దుండగులు. కానీ ఆ రాళ్లు చంద్రబాబు వరకు చేరకపోవడంతో ప్రమాదం తప్పింది.  

అమరావతి : 

వైసిపి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇలాగే చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి జరిగింది. రాజధాని అమరావతి పరిస్థితిని పరిశీలించేందుకు టిడిపి సీనియర్లతో కలిసి చంద్రబాబు బస్సులో వెళుతుండగా రాళ్లదాడి జరిగింది. వాహనంపై దుండుగులు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో బస్సులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు... చంద్రబాబుతో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 

యర్రగొండపాలెం : 

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో గతేడాది చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతేడాది ఇదే ఏప్రిల్ నెలలో యర్రగొండపాలెం వెళుతున్న చంద్రబాబును మంత్రి ఆదిమూలపు సురేష్ తన వర్గీయులతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారు.  చంద్రబాబును కాపాడే క్రమంలో ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 

నందిగామ : 

2022 లో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా నందిగామలో రోడ్ షో చేపట్టిన చంద్రబాబు రాళ్లదాడి జరిగింది. ఈ క్రమంలో ఓ దుండగుడు చంద్రబాబుపై రాయి విసరగా అదికాస్త భద్రతా సిబ్బందికి తగిలింది. దీంతో చంద్రబాబు భద్రతాధికారికి తీవ్ర గాయం అయ్యింది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios