అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సభ్యులు రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రద్దు అయిన నేపథ్యంలో వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నారాయణ స్వామి డిమాండ్ చేశారు. 

టీడీపీ పాలకమండలి రద్దు కావాలని, అలాగే సభ్యులు అంతా తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకమండలి రద్దు కోసం డిమాండ్ చేస్తుంటే టీటీడీ పాలక మండలి మాత్రం పాలకమండలి సమావేశానికి పిలుపునిచ్చింది. 

మంగళవారం ఉదయం టీటీడీ పాలక మండలికి నిర్ణయం తీసుకుంటి. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. మరోవైపు టీటీడీ పాలకమండలి రద్దు చేయకుండా ఉదయం టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయబోయే సమావేశాన్ని తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. 

టీటీడీ బోర్డు మెుత్తం రద్దు  కావాలని కానీ పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. టీటీడీ ఈవో పాలకమండలి సమావేశానికి హాజరుకాకుండా ఉంటే మంచిదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే నారాయణ స్వామి. 

ఇకపోతే గత ఏడాది ఏప్రిల్ నెలలో పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ చైర్మన్ గా అప్పటి  సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. పాలకమండలి రెండేళ్లపాటు కొనసాగనున్న నేపథ్యంలో 2020 ఏప్రిల్ వరకు పాలకమండలికి సమయం ఉంది. 

ఈ నేపథ్యంలో పాలకమండలి రద్దు అయ్యేందుకు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము దేవుడి సేవ చేసుకునేందుకు వచ్చామని తాము రాజీనామా చేయమని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని పాలకమండలి సభ్యులు స్పష్టం చేస్తున్నారు. 

ప్రతీ మూడు నెలలకొకసారి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించాలని అందులో భాగంగా మంగళవారం జరగనుందని ప్రస్తుత పాలకమండలి స్పష్టం చేస్తోంది.  పాలకమండలి రద్దు చేయకుండా ఉండేందుకు భక్తిని సాకుగా చూపిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. 

చంద్రబాబు నాయుడు వందల కోట్లాది రూపాయలు తీసుకుని నామినెటెడ్ పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. 2014లో కాంగ్రెస్ నేత, అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు సైతం పాలకమండలి రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వానికి చుక్కలు చూపించారు.

 పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చంద్రబాబు ఎన్నిసార్లు సూచించినప్పటికీ ఆయన చేయలేదు. అలా మూడు నెలల పాటు కాలయాపన చేశారు. అనంతరం పాలకమండలిని రద్దు చేశారు.