Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్... ప్యూజన్ ఫుడ్స్ వ్యవహారంలో స్టేటస్​ కో

నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో వీఎంఆర్‌డీఏ స్థలంలో నిర్వహిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు ఖాళీ చేయించారు. 

status quo on fusion foods: AP High Court
Author
Visakhapatnam, First Published Nov 17, 2020, 10:00 AM IST

అమరావతి: జగన్ ప్రభుత్వానికి ఏపి హైకోర్టు షాకిచ్చింది.  నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో వీఎంఆర్‌డీఏ స్థలంలో నిర్వహిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు ఖాళీ చేయించారు. అయితే దీనిపై హోటల్ నిర్వహకులు హైకోర్టును ఆశ్రయించగా ఈ​ విషయంలో యధాతధస్థితి పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

లీజు గడువు ముగియకముందే తమ హోటల్​ విషయంలో అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ విశాఖలోని ఫ్యూజన్​ ఫుడ్స్​ అండ్​ శ్రీకన్య కంపర్ట్స్​ హోటల్ యజమాని హర్షవర్ధన్​ ప్రసాద్​ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ బి.కృష్ణ మోహన్​ విచారణ జరిపి యథాతథస్థితి (స్టేటస్​ కో) పాటించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 

ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావుడిగా హోటల్​ను ఖాలీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని...ఇది చట్ట విరుద్ధమని తన పిటిషన్​లో హర్షవర్ధన్​ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే నిబంధనలు పాటించకుండానే తొమ్మిదేళ్ల పాటు అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై వీఎంఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్‌ను స్వాధీనం చేసుకోగా తమ అనుమతి లేకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 

read more  మేం మఠాలకు ఎకరాలు రాసివ్వలేదు.. కానీ: టీడీపీ నేతలకు మల్లాది కౌంటర్

ప్రశాంత విశాఖ నగరాన్ని కక్ష సాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్ చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ నేతల పంపకాల్లో భాగంగానే ఫ్యుజన్ ఫుడ్స్ ఖాళీ చేయించారని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విధ్వంసం, విచ్ఛిన్నం రెండు కళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలన సాగుతోందని  అచ్చెన్నమండిపడ్డారు. 

 ''జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు విశాఖ ఘటన పరాకాష్ట. విశాఖ నగరంలోని సిరిపురంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే ఏకైక కారణంతో ఫ్యూజన్ ఫుడ్స్ భవనాన్ని ఖాళీ చేయించడం ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిలువుటద్దం. హోటల్ లీజు గడువు 2024 వరకు ఉన్నప్పటికీ పండగ పూట హడావుడిగా ఖాళీ చేయించడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా ఖాళీ చేయిస్తారు.?'' అని ప్రశ్నించారు. 

''దీపావళి నాడు పబ్లిక్ హాలిడే. ఆ రోజు ప్రభుత్వ అధికారులంతా సెలవులో ఉన్నారు. కానీ.. పండగపూట ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అధికారులపై ఏ స్థాయిలో ఒత్తిడులున్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2024 వరకు గడువు ఉందని హోటల్ యజమాని హర్ష అన్ని పత్రాలు చూపిస్తున్నా.. అధికారులు పట్టించుకోకుండా హోటల్ ఖాళీ చేయించడం ప్రభుత్వ నిరంకుశత్వం కాదా.? నోటీసులు కూడా ఇవ్వకుండా ఖాళీ చేయించడం అధికార దుర్వినియోగం కాదా.?''అని నిలదీశారు. 

''లీజులు లేకుండా ఇష్టానుసారంగా వైసీపీ నేతలు ఇసుక తవ్వుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి పాల్పడుతుంటే పట్టించుకోని అధికారులు.. క్రమం తప్పకుండా లీజు సొమ్ము చెల్లిస్తూ, ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేసుకుంటున్న టీడీపీ సానుభూతిపరుడి వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడం కక్ష సాధింపు చర్యలు కాదా.? లీజు గడువు ముగియకుండా భవనాన్ని స్వాధీనం చేసుకోవాలనుకోవడం జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనం'' అన్నారు. 

''మొన్న సబ్బం హరి ఇంటి ధ్వంసం, నిన్న గీతం కాలేజీ భవనాలు ధ్వంసం, నేడు టీడీపీ సానుభూతిపరుడు హర్షకు చెందిన ఫ్యుజన్ ఫుడ్స్ హోటల్ విధ్వంసం జగన్ రెడ్డి కక్ష పూరిత పాలనకు నిలువుటద్దాలు. రోజుకో వరుస ఘటనలతో ప్రశాంత విశాఖ నగరాన్ని జగన్ రెడ్డి.. విధ్వంసానికి, విశృంఖల అకృత్యాలకు అడ్డాగా తయారు చేస్తున్నారు. సక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల్ని కూడా అక్రమాస్తులంటూ జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం'' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios