ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌‌ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు ఆందోళనకు గురిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌‌ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, శుక్రవారం రోజున శ్రీసత్యసాయి జిల్లాలోని గాండల్లపెంటలో ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నల్లచెరువు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. 

విజయ్ కుమార్ ప్రస్తుతం టెన్త్ ఎగ్జామ్స్ గాండ్లపెంట చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్నారు. గాండ్లపెంట నుంచి ఇంగ్లీష్ ప్రశ్రపత్రాన్ని పంపినట్టుగా ప్రాథమిక నిర్దారణ కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. 

శ్రీనివాసరావు నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. శ్రీనివాసరావుకు విజయ్‌కుమార్‌కు మధ్య పరిచయం ఉంది. దీంతో వీరిద్దరు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో డీల్ మాట్లాడుకుని ప్రశ్నపత్రం లీక్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

ఇక, శుక్రవారం ఉదయం తొలుత సత్యసాయి జిల్లాలోని ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లిష్ పేపర్ లీకైనట్టుగా ప్రచారం జరిగింది. దీంతో జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ప్రశ్నపత్రం లీక్‌కు ఆ పాఠశాలకు సంబంధం లేదని నిర్దారించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. నంద్యాల పేపర్ లీక్ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో నారాయణ విద్యాసంస్థల వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌, ఎన్‌ఆర్‌ఐ స్కూల్‌ ప్రిన్సిపాల్‌‌ సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

ఇక, రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ అయినట్టుగా ప్రచారం జరిగింది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చిందని ప్రచారం జరగడంతో.. కలెక్టర్ బి లఠ్కర్ వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ రొట్టవలస పరీక్షా కేంద్రానికి వచ్చి అధికారులను ఆరా తీశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. లీకేజీ వందతుల్లో వాస్తవం లేదని అన్నారు. వదంతులు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.