Asianet News TeluguAsianet News Telugu

మోహినీ అవతారంలో జగన్మోహనుడు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. 

srinivasudi brahmotsavalu
Author
Tirumala, First Published Sep 17, 2018, 5:12 PM IST

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.


మోహినీ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు.


    అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.


    

జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామివారు సోమవారం రాత్రి గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదేరోజు తిరుమలలో శ్రీవారు శ్రీవిల్లిపుత్తూరు నుండి విచ్చేసిన ప్రత్యేక మాలలు, చెన్నై నుండి వచ్చిన అలంకృత ఛత్రాలు స్వామివారి గరుడవాహన సేవకు మరింత శోభను చేకూర్చుతాయి. 

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


   ఈ వేడుకల్లో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి శ్రీకె.యస్‌.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీ పొట్లూరి రమేష్ బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios