న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతీ నవరత్నం కరిగిపోతుందని ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. నవరత్నాలను మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుని ఎన్నికల్లో లబ్ధిపొందిన జగన్ ఆ తర్వాత వాటిని గాలికొదిలేశారని చెప్పుకొచ్చారు. 

జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఒక్కో రత్నం కరిగిపోతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రత్యేకంగా ఓ దర్యాప్తు బృందాన్ని రాష్ట్రానికి పంపి విచారణ చేపట్టాలని కోరారు. 

ఎన్నికల అనంతరం కొన్ని ప్రాంతాల్లో టీడీపీ మద్దతుదారులపై వైసీపీ వర్గీయులు వేధింపులకు గురి చేశారని గ్రామాలు, ఇళ్లలోంచి తరిమేసిన ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న చర్యలు తీసుకుపోగా మీరంతా కొంతకాలం బయట ఉండండి అంతా సర్థుకుంటుంది అంటూ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ గల్లా జయదేవ్ ఆరోపించారు. 

వైసీపీ నాలుగున్నర నెలల పాలనలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్ వైఫల్యం చెందారంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. రైతుభరోసా విషయంలో జగన్ ఎన్నికల ముందు చెప్పింది ఒక్కొటి చేస్తోంది మరోకటని మండిపడ్డారు. 

కేంద్రం నుంచి వచ్చే నిధులకు రైతు భరోసా పేరు పెట్టి ఇస్తున్నారంటూ మండిపడ్డారు. గోదావరి పడవ ప్రమాదంపై బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఒక్క ప్రకటన కూడా చేయలేదని ధ్వజమెత్తారు రామ్మోహన్ నాయుడు.