శ్రీకాకుళం జిల్లాలో  ఫీవర్ సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును, కంటైన్మెంటు జోన్ లలో స్ధితి గతులను పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రభలే సమయం కావడంతో జ్వరాలపై ఇంటింటా సర్వే చేసి జ్వరం ఉంటే కరోనా కేసుగా పరిగణించి వైద్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, వివిధ వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 

ప్రజలకు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని...ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులు సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని శుభ్రపర్చుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్ భారీన పడకుండా ప్రాథమికంగా పాటించాల్సిన నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. దీనిని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

read more    పలాస ఘటనపై జగన్ సీరియస్... మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

లాక్ డౌన్ సడలింపుతో ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. కంటైన్మెంటు జోన్లలో ప్రజలు సూచనలను పక్కాగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరాలు, తాగు నీరు, పాలు, పెరుగు వంటి పదార్ధాలు అందేటట్లు చూడాలని అధికారులకు సూచించారు. కంటైన్మెంటు జోన్లలో ప్రతి ఒక్కరి నమూనా సేకరించి పరీక్షంచాలని ఆదేశించారు. 

కలెక్టర్ నివాస్ వెంట టెక్కలి రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య, మునిసిపల్ కమీషనర్లు, ఇతర స్థానిక అధికారలు పర్యటించారు.