ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. జగన్ పై ఎవరు దాడి చేయించారా అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే.. జగన్ దాడి నేపథ్యంలో.. ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

అదేంటంటే...1984లో కూడా ఏపీలో ఇదే తరహాలో ఓ దాడి జరిగింది. అప్పట్లో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుపై ఈ దాడి జరిగింది. ఓ 22ఏళ్ల వయసున్న యువకుడు మల్లెల బాబ్జీ ఎన్టీఆర్‌పై దాడి చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఘటన జరిగింది. ‘ఇందిరా గాంధీ జిందాబాద్’ అని కేకలు వేస్తూ బాబ్జీ ఎన్టీఆర్‌పై దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో ఎన్టీఆర్ వేలికి స్వల్ప గాయమైంది. అప్పట్లో ఈ దాడి ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
 
ఈ కేసులో స్వయంగా ఎన్టీఆరే కోర్టుకు హాజరయ్యారు. బాబ్జీని క్షమించాలని కోర్టును కోరారు. బాబ్జీ జైలు నుంచి 1985లో బయటికొచ్చాడు. గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్‌లో తోటమాలిగా పనిచేశాడు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లకు బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో రెండు పేజీల లేఖ దొరికింది. ఎన్టీఆర్‌పై దాడి చేస్తే 3లక్షలు ఇస్తామన్నారని కానీ 30వేలు మాత్రమే చెల్లించారని ఆ లేఖలో బాబ్జీ పేర్కొనడం గమనార్హం. బాబ్జీ మృతిపై విచారణ జరిపిన జస్టిస్ శ్రీరాములు కమిషన్ ఆ లేఖలోని అంశాలను బయటపెట్టింది. ఘటనకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ వివాదానికి తెర పడింది. తాజాగా జగన్‌పై దాడి ఘటనలో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.