ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయం కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని.. ఇది బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వ్యవస్థల అధికారాన్ని అపహాస్యం చేస్తున్నారని.. అది సరైన పద్ధతికాదన్నారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వ్యవస్థను దేశాన్ని కాపాడాలి కాని సంక్షోభం సృష్టించకూడదని అన్నారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే పనిలో ఉందని..ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం బాధాకరమన్నారు.

ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం కుదరదన్నా ..ఎన్నికల కమీషన్ నియంతలా ఎన్నికలు జరిపించాలని అనడం వెనుక ఏ దుష్ట శక్తి ఉందని ప్రశ్నించారు. జాతి విపత్తు దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

 ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా ఏ ప్రభుత్వం అయినా క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం గౌరవించాల్సి ఉందని తెలిపారు. నియంత్రత్వ ధోరణితో వెళ్తే ఎలా అని మండిపడ్డారు. న్యాయ స్థానం ప్రజల పక్షాన తీర్పు చెప్పిందని..రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చిందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.