అమరావతి:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సమాజ్ వాదీ పార్టీ నేత మాజీసీఎం అఖిలేష్ యాదవ్ ఫోన్ చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని కోరారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే విషయంలో తమ పార్టీ మద్దతు ఉంటుందని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.

2019లో బీజేపీని ఓటమి లక్ష్యంగా అఖిలేష్ యాదవ్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు అవసరమైతే బీఎస్పీతో కలిసి పనిచేస్తామని కూడా చెప్పారు. 

తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయిస్తే కలిసి పని చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతికి స్పష్టం చేశారు కూడా. ఇటీవలే మాయావతి తాను బీజేపీకి వ్యతిరేకంగా గ్రాండ్ అపోజిషన్ అలెయన్స్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు కూడా. 
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయంపై జాతీయ పార్టీలను కలిసి తమ వాదన వినిపించారు సీఎం చంద్రబాబు నాయుడు. జాతీయ పార్టీలను ఏకం చేసేందుకు పావులు కదిపారు. ఢిల్లీ కేంద్రంగా పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. 

ఇటీవలే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ పార్టీ నేతలతో సమావేశం కావడం కొద్దిరోజుల్లోనే చంద్రబాబు నాయుడుకు అఖిలేష్ యాదవ్ ఫో చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జాతీయ నాయకులతో మరోసారి చర్చించేందుకు చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మరోసారి హస్తిన వేదికగా జాతీయ నాయకులతో భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.