మటన్ కూర సరిగా లేదన్న చిన్న కారణం తండ్రిని కన్నకొడుకు దారుణంగా హత్య చేసేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వీ కోట మండలం కె.పాతూర్ గ్రామానికి చెందిన చెల్లా గుర్రప్ప తన కొడుకు, కోడలుతో కలిసి ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం కావడంతో ఇంట్లో మటన్ కూర వండారు. సాయంత్రం అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. ఈ సమయంలో గుర్రప్ప కోడలు భోజనం వడ్డించారు. ఆమె చేసిన మటన్ కూరను తిన్న గుర్రప్పకు దాని రుచి నచ్చలేదు.  

తీవ్ర ఆగ్రహానికి గురైన అతను భోజనం ప్లేటును కోడలి ముఖంపై అందరి ముందు విసిరేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయమైంది. తన భార్యపై తండ్రి ప్రవర్తనను తీవ్రంగా అభ్యంతరం తెలిపిన గుర్రప్ప కుమారుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.

వెంటనే తండ్రితో గొడవకు దిగి.. వెంటనే అతని తలను పలుమార్లు గోడకు విసిరి కొట్టాడు. తలకు తీవ్ర గాయాలపాలు కావడంతో గుర్రప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చెల్లప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనలో మిగిలిన కుటుంబసభ్యుల పాత్రపై ఆరా తీస్తున్నారు.