పున్నామ నరకం నుండి కాపాడాల్సిన కొడుకు ఆ తండ్రికి బ్రతికుండగానే నరకం చూపించాడు. తండ్రి అన్న గౌరవం లేదుకదా వృద్దుడన్న జాలి కూడా చూపించకుండా కేవలం మద్యానికి డబ్బుల కోసం ఏకంగా తండ్రినే హతమార్చాడు ఓ కసాయి తనయుడు. మానవత్వానికి మచ్చతెచ్చే ఈ విషాద సంఘటన  కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

చందర్లపాడుకు చెందిన షేక్  మైబుకు ఐదుగురు సంతానం. వుద్దుడయిన అతడు కొడుకు షిలారు వద్ద వుంటున్నాడు. అయితే ఈ నెల మైబుకు వృద్దాప్యపించను  డబ్బులు వచ్చాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కొడుకు మద్యం తాగడానికి ఆ డబ్బులివ్వాల్సింది డిమాండ్ చేశాడు. అందుకు మైబు ఒప్పుకోకపోవడం బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నించాడు. 

అయినా కూడా మైబు డబ్బులను వదల్లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనై  విచక్షణను  కోల్పోయిన షిలారు తండ్రిని చితకబాదాడు. ఇలా కొడుకు చేతిలో  దెబ్బలుతిని  తీవ్రంగా గాయపడిన మైబు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు  అతన్నిఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు.

తండ్రి మృతికి కారణమైన కొడుకు షిలారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కన్నతండ్రి చావుకు కారణమైన అతడికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ స్థానికులు పోలీసులను  డిమాండ్ చేస్తున్నారు.