Asianet News TeluguAsianet News Telugu

మంటకలిసిన మానవత్వం... ఆస్తి కోసం కన్న తల్లి మృతదేహాన్నే అడ్డుకున్న కసాయి కొడుకు

బ్రతికుండగా ఆస్తి కోసం కన్నతల్లికి నరకం చూపించిన ఓ కసాయి కొడుకు చనిపోయిన తర్వాత కూడా కర్కశంగా వ్యవహరించాడు. 

Son Behaves so cruel to their Mother deadbody
Author
Amaravathi, First Published May 26, 2020, 11:40 AM IST

మంగళగిరి: నవమాసాలు మోసి కనీ పెంచి... విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకున్ని చేసిన కన్నతల్లి పట్ల  కర్కశంగా వ్యవహరించాడో కసాయి కొడుకు. ఇన్నాళ్లు వృద్దురాలయిన కన్నతల్లి ఆలనా పాలనా పట్టించుకోకపోగా ఆమె చనిపోయాక కూడా మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుని కర్కశంగా వ్యవహరించాడు ఆ కొడుకు. ఆమె కడుపునే పుట్టిన అమ్మాయి మాత్రం తల్లి అంత్యక్రియలు చేయడానికి సిద్దంగా వున్నా జరిపించలేని దీనస్థితిలో వుంది. దీంతో  తల్లి మృతదేహం వద్ద భోరున విలపించడం తప్ప ఏం  చేయలేకపోతోంది. 

మానవత్వం మంటగలిసిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన యుద్ధం సత్యనారాయణ భార్య ధనలక్షి (70) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె కలరు. కుమార్తెకు గత కొన్నేళ్ళ క్రితం బాపట్లకు చెందిన యువకునితో  వివాహం జరిపించారు.  ఇక  సత్యనారాయణ, ధనలక్ష్మీ ల కుమారుడు నాగమల్లేశ్వరరావు వివాహం అనంతరం చెడు అలవాట్లకు బానిసగా మారి తరచూ ఆస్తి కోసం వారితో తరచూ గొడవపడుతుండేవాడు.  దీంతో కుమారుడి వేధింపులపై తల్లిదండ్రులు  ఒకటి, రెండు పర్యాయాలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు   కుమారుడు నాగమల్లేశ్వరరావు పై కేసులు సైతం నమోదు చేశారు.  అయినా అతనిలో ఏ మాత్రం మార్పు రాలేదు.  

ఈ నేపధ్యంలో  తండ్రి సత్యనారాయణ  మానసిక వేధనతో  అనారోగ్యానికి గురై ఈ ఏడాది జనవరి 19న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో  మృతి చెందాడు.  చనిపోయిన తండ్రికి సైతం అప్పట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు నాగమల్లేశ్వరరావు  పెద్ద  పంచాయతినే పెట్టాడు. తనకు ఆస్తి రాసిస్తేనే  కన్నతండ్రికి  తలకొరివి పెడతానని  కుటుంబ సభ్యులు, బంధువుల ఎదుట తేల్చిచెప్పాడు. దీంతో తల్లి ధనలక్ష్మి  తమకు ఉన్న ఇంటిలో  సగం వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కుమారుడు నాగమల్లేశ్వరరావు కన్నతండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.   

read more ఏపీలో ఆగని కరోనా వ్యాప్తి: మరో 48 పాజిటివ్ కేసులు, మరో మరణం

అయితే తండ్రి పెదఖర్మ కాకముందే మరోమారు నాగమల్లేశ్వరరావు  ఆస్తి కోసం  తల్లి ధనలక్ష్మి పై తిరిగి  వేధింపులు ప్రారంభించాడు.  గత మూడు నెలల క్రితం  తల్లి ధనలక్షి ని ఇంట్లో బంధించి తలుపులు వేశాడు. దీంతో భయపడిన ఆమె వంటగది వెనుక ఉన్న తలుపులు తీసుకుని  పోలీస్ స్టేషన్ కు చేరుకుని కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకొంది. దీంతో పోలీసులు ఆమె కుమారుడు నాగమల్లేశ్వరరావు పై మరో కేసు నమోదు చేసి కోర్టుకు సైతం హాజరుపర్చగా బెయిల్ పై విడుదల అయ్యాడు.  తన కుమారుడి వేధింపులు తాళలేని వృద్ధురాలు ధనలక్ష్మి గత నాలుగు నెలల నుంచి  బాపట్లలోని తన కుమార్తె వద్ద తలదాచుకొంది.  

ఈనేపధ్యంలో ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన  వృద్ధురాలు ధనలక్ష్మి  సోమవారం మధ్యాహ్నం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  అయితే ఆమె అల్లుడు సైతం లాక్ డౌన్ కారణంగా  విజయనగరంలో ఉండిపోవడంతో  కుమార్తె తన తల్లి భౌతికకాయానికి అంత్యక్రియలు జరిపించేందుకు అదేరోజు రాత్రి  అంబులెన్స్ లో మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ లోని  తల్లిదండ్రుల స్వగృహానికి తీసుకువచ్చింది.

 కన్నతల్లి మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించకుండా  కుమారుడు నాగమల్లేశ్వరరావు వీరంగం చేశాడు.  తన సోదరితో పాటు పలువురు స్థానికులు సైతం ఎంత  బ్రతిమిలాడినా  అతని హృదయం కరగలేదు.

పేగుబంధం తెంచుకుని జన్మించిన  కర్కశ కొడుకు తన కన్నతల్లి మృతదేహాన్ని అడ్డుకున్నాడని తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని నాగమల్లేశ్వరరావు ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అంబులెన్స్ లోనే మూడు గంటలకు పైగా ఉన్న ధనలక్ష్మి మృతదేహాన్ని కిందికి దించి మార్చురీ బాక్సులో ఉంచారు.  కాగా  మృతురాలి కుమార్తె ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే.  లాక్ డౌన్ నేపధ్యంలో  వృద్ధురాలు ధనలక్ష్మి అంత్యక్రియలు జరిపించాలంటే దాతలు కూడా తమ వంతు సహాయ సహకారాలు  అందించాల్సి ఉంది. అందుకోసం ఆ కూతురి ఎదురుచూస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios