ఆస్తుల కోసం మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో రోజుకొక ఉదాహరణ. తాజాగా తండ్రిని ఆస్తి రాయమని ఒత్తిడి చేస్తూ ఆయనను నరకయాతన పెడుతున్నారు. 

ఆస్తుల కోసం మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో రోజుకొక ఉదాహరణ. తాజాగా తండ్రిని ఆస్తి రాయమని ఒత్తిడి చేస్తూ ఆయనను నరకయాతన పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ పరిధిలోని లేతమామిడి తోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది.. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతనికి పెళ్లికాలేదు.. చిన్న కుమారుడు చిరంజీవికి, కూతురు సౌమ్యకి పెళ్లి అయ్యింది. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఐదు సెంట్ల స్థలంతో పాటు మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ మధ్యకాలంలో చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజనీ ఆస్తి తమ పేరిట రాయమని తండ్రితో గొడవ పడుతున్నాడు.. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల దిగుబడి కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు.

ఒక రోజున కుక్కను తీసుకువచ్చి తండ్రిపై ఉసిగొల్పి దానితో కారిపిస్తామని భయపెడుతున్నారు. వారి వేధింపులు భరించలేకపోయిన లక్ష్మణదాసు స్థానిక పెద్దలకు చెప్పాడు.. మధ్యలో కలగజేసుకున్న పెద్దలను కూడా కొడుకు, కోడలు అసభ్యపదజాలంతో దూషించి వెళ్లారు. ఆస్తి కొడుకులిద్దరి పేరు మీద రాయమని సర్పంచ్ సలహా ఇవ్వడంతో... ఇద్దరి పేరు మీదా చెరొక 5 సెంట్ల స్థలం రాసేందుకు సిద్ధపడ్డాడు.

అయితే నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో లక్ష్మణదాసు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇంట్లో ఉంటే అనరాని మాటలు అనడమే కాకుండా.. తనను మానసికంగా వేధిస్తున్నారని.. కొడుకు, కోడలి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా లక్ష్మణదాసు తహసీల్దార్‌కు గోడు వెళ్లబోసుకున్నాడు.