ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని భాజపా కోరుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.  అధికార వైసీపీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. 

పోలీసు, రెవెన్యూ, ఎలక్షన్ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల వలే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. మా పార్టీ ఏజెంట్ ముందే ఒకరి ఓటును మరొకరు దొంగఓటు వేస్తుంటే.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని సదరు వ్యక్తిని పోలీసులకు అప్పజెప్పాం అన్నారు. 

తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు రాత్రికి రాత్రే ఒక మంత్రిగారి అనుయాయులు వేలాది మంది దిగారని, వివిధ నియోజకవర్గ పరిధులో రాత్రినుండే వీరు తిష్ట వేశారని అన్నారు.

ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించి, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. చివరి గంట కరోనా రోగులకు కేటాయించారు కరోనా వైరస్ బాధితులను సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఓటు వేయడానికి అనుమతిస్తారు. 

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 17,11,195 మంది ఓటర్లు ఉన్నారు. లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బిజెపి, జనసేన కూటమి నుంచి రత్నప్రభ పోటీ పడుతున్నారు. 

తిరుపతి ఉప ఎన్నిక: ఉదయం 9 గంటల వరకు 7.8 శాతం పోలింగ్...

తిరుపతి లోకసభ సీటు పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు 10,850 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 23 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మూడు కంపెనీల ప్రత్యేక బలగాలు తిరుపతి లోకసభ పరిధిలో మోహరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాయి. 

తొలిసారి 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 508 మంది, దివ్యాంగులు 284 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.