నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. అమరావతికి ముంపు ప్రమాదం ఉందనే బొత్స వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతికి ఏమీ కాదని ఆయన అన్నారు. 

పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టీడీపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ పంతానికి వెళ్లవద్దని ఆయన సూచించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై కోపంతో జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తారో తెలియడం లేదని ఆయన అన్నారు. 

పిపిఎలపై రివ్యూల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కూడా కష్టంగా మారిందని ఆయన అన్నారు. కేంద్రమే పోలీవరం బాధ్యతలు తీసుకుని, దాన్ని నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. జగన్ కు పేరు వచ్చినా తమకు అభ్యంతరం లేదు గానీ ప్రజలు బాగుపడితే చాలునని ఆయన అన్నారు. 

కొన్ని ప్రాజెక్టులు ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్నాయని, దాంతో పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి నిర్మాణ బాధ్యతలు తమకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం కోరితే కేంద్రం అనుమతి ఇచ్చిందని, కేంద్రం పర్యవేక్షణలో పనులు తాము చేస్తామని చెప్పామని ఆయన అన్నారు. నవయుగకు కాంట్రాక్టు ఇచ్చినప్పుడు అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ అంగీకరించారని, పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన గుర్తు ేచశారు. 

తాము పరువుప్రతిష్టలకు వెళ్లలేదని, ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశామని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులను కొనసాగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని, పనులు ఆగిపోకూడదని ఆయన అన్నారు. జగన్ పోలవరం పనులను యధావిధిగా కొనసాగిస్తే తమకేమీ అభ్యంతరం ఉండేది కాదని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వృద్ధి రేటు పడిపోయిందని ఆయన అన్నారు. 

చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేశారని ఆయన విమర్శించారు. పోలవరం, అమరావతి విషయాల్లో జగన్ తన వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.