ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైసీపీ అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టింది. కాగా..పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ... ఒక్కొక్కరుగా టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అప్పటి వరకు వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన వారు... ఇప్పుడు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.

కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని లక్ష్మీమాధవరాయస్వామి ఆలయ చైర్మన్‌గా ఉన్న ఆకుల కృష్ణయ్య ఆ పదవికి రాజీనామా చేసి పత్రాన్ని ఆలయ కార్యదర్శి రమణారెడ్డికి అందజేశారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న గుండంరాజు సుబ్బయ్య సోమవారం తన పదవికి రాజీనామా చేసినట్లు విలేకరులకు తెలిపారు.
 
ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచడంతో పాటు ఆధునీకరించామని, అలాగే ఉచిత కంటి అద్దాలు, పిల్లలకు ఇంక్యూలేటర్‌, స్కానింగ్‌ తదితర ఆధునిక పరికరాలతో పాటు అనేక వసతులు సమకూర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల కౌంటింగ్‌ రోజు ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.