నేనేం చేశానో చెప్పకుండా అరెస్టు చేశారు, భయబ్రాంతులను చేశారు: చంద్రబాబు
తనను ఎపి సిఐడి అధికారులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు.

నంద్యాల: తనను ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్సందించారు. తాను ఏం చేశానో చెప్పుకుండా అరెస్టు చేశారని ఆయన మీడియాతో అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా, తాను చేసిన నేరం ఏమిటో నిరూపించకుండా అరెస్టు చేశారని, అది చాలా తప్పు అని ఆయన అన్నారు.
ఏమైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని ఆయన అన్నారు. అర్ధరాత్రి వచ్చి అందరినీ భయబ్రాంతులను చేసి తనను అరెస్టు చేశామని చెప్పారని ఆయన అన్నారు. తానేమైనా టెర్రరిస్టునా ఆయన ప్రశ్నించారు. మాకు అధికారం ఉంది, ఏమైనా చేసుకుంటామనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అడ్డుకోవడానికి, ప్రజలను భయబ్రాంతులను చేయడానికి తనను అరెస్టు చేశారని ఆయన అన్నారు.
తాను ఏం చేశానో చెప్పకుండా చేయడం ప్రాథమిక హక్కులను భంగపరచడమేనని ఆయన అన్నారు. సామాన్యుడికి కూడా ప్రాథమిక హక్కులుంటాయని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుందని, కానీ ఏమీ చెప్పలేదని, చాలా బాధేస్తోందని ఆయన అన్నారు. అర్ధరాత్రి తనను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు. చ
నంద్యాల నుంచి చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. ఇది 330 కోట్ల రూపాయల కుంభకోణం. చంద్రబాబు వెంట టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు ఉన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని, అన్ని విషయాలు రిమాండు రిపోర్టులో ఉన్నాయని, ఆ విషయం హైకోర్టకు చెప్పామని సిఐడి అధికారులు అంటున్నారు.